కోన వెంక‌ట్‌పై చీటింగ్ కేసు

February 16, 2020

ప్ర‌ముఖ టాలీవుడ్ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ చిక్కుల్లో ప‌డ్డాడు. ఆయ‌న‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. జెమినీ ఎఫ్‌ఎక్స్ అనే సంస్థకు డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న ప్రసాద్‌.. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కోన వెంక‌ట్ మీద‌ ఫిర్యాదు చేశాడు. ఓ సినిమాకు గాను కథ ఇస్తానని చెప్పి 2017లో కోన వెంకట్ త‌న నుంచి రూ.18.50 లక్షలు తీసుకున్నారని.. కానీ త‌ర్వాత మాట నిల‌బెట్టుకోలేద‌ని ప్ర‌సాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోన వెంక‌ట్‌ కథ ఇవ్వకపోగా, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్ప‌డుతున్నాడ‌ని ప్ర‌సాద్ ఆరోపించాడు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మామూలుగా అయితే ఈ వార్త‌ను నెటిజ‌న్లు లైట్ తీసుకునేవాళ్లు కానీ.. కోన వెంక‌ట్ ఇటీవ‌లి ఎన్నిక‌ల సంద‌ర్భంగా పొలిటిక‌ల్ రంగు పులుముకోవ‌డంతో దీన్ని హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు కోన‌ను టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక‌ప్పుడు ప‌వ‌న్ త‌న సోల్ మేట్ అన్న కోన‌.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా యుటర్న్ తీసుకోవ‌డం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారుగా మారి ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఆయ‌న మీద ఏ ర‌క‌మైన నెగెటివ్ వార్త వ‌చ్చినా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ‌ట్లేదు. తాజా కేసు వార్త‌ను వైర‌ల్ చేస్తూ కోన‌ను అన్ పాపుల‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.