అమెరికాలో ఎంత పెద్ద అగ్నిప్రమాదమంటే?

August 06, 2020

అగ్రరాజ్యమైన అమెరికాలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అలబామాలో చోటు చేసుకున్న ఈ భారీ ఫైర్ యాక్సిడెంట్లో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. టెన్నెస్సీ నదీ తీరం వెంట ఉన్న బోటు డాక్ యార్డులో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు 35 పడవులు మంటల్లో చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారో తెలీటం లేదని.. పడవుల్లో ఎంతమంది ఉన్నారో తెలీదని చెబుతున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఉదంతంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. అర్థరాత్రి దాటిన తర్వాత జాక్సన్ కంట్రీ పార్కుకు అంటుకున్న మంటలు డాక్ యార్డు వైపునకు వేగంగా విస్తరించాయని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవల్లో ఉన్న వారు ఎక్కువమంది గాఢ నిద్రలో ఉండటంతో స్పందించటంలో జరిగిన ఆలస్యం.. ఎక్కువమంది ప్రాణాలు పోయేందుకు కారణంగా భావిస్తున్నారు.
పడవుల్ని నిలిపిన ప్రాంతం చెక్కలతో నిర్మించి ఉండటంతో.. మంటలు వేగంగా విస్తరించటానికి వీలు కలిగింది. దీనికితోడు.. పడవుల్లో పెద్ద ఎత్తున గ్యాస్ ట్యాంకులు ఉండటంతో.. అగ్నికీలలు చాలా వేగంగా విస్తరించాయని చెబుతున్నారు. కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వ్యవధిలోనే మొత్తం డాక్ యార్డు మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.
మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవకాశం లేకపోవటంతో..తమ ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం పలువురు నీళ్లల్లోకి దూకేసినట్లుగా చెబుతున్నారు. ఇలా నీళ్లల్లోకి దూకిన పలువురిని అధికారులు రక్షించారు. ఎంతమంది నీళ్ల్లల్లోకి దూకారు? వారిలో ఎంతమందిని రక్షించారు?మరెంత మంది నీటిలోనే ఉన్నారన్న విషయంపై సమాచారం బయటకు రాలేదు. ఏమైనా ఈ భారీ అగ్నిప్రమాదంతో ఆగ్రరాజ్యం ఉలిక్కిపడేలా చేసిందని చెప్పక తప్పదు.