ఫ్లోటింగ్ కేపిటల్... ఏపీకి మాత్రమే ప్రత్యేకమట

February 25, 2020

నిజమే... ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి పడ్డ ఓ ఆసక్తికరమైన పోస్ట్ తెగ వైరల్ గా మారిపోయింది. వైసీపీ అధినేత ఏపీకి సీఎంగా మారిన తర్వాత అప్పటికే టీడీపీ సర్కారు ప్రకటించిన రాజధాని అమరావతిపై నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి మూడు రాజధానులుంటాయేమోనని అసెంబ్లీ వేదికగానే ప్రకటించిన జగన్... ఆ దిశగా ఇంకా స్పష్టమైన ప్రకటన చేయకుండానే ముందుకు సాగిపోతున్నారు. అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు పరిమితం చేసేసి... విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ ను ఏర్పాటు చేసే దిశగా జగన్ సర్కారు చాలా వేగంగానే కదులుతోంది. ఈ క్రమంలో... ఎవరు పెట్టారో గానీ... సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఏపీకి ఫ్లోటింగ్ కేపిటల్’ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది. 

ఈ పోస్టు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిందే మొదలు... దానిని చూసిన వారంతా తెగ నవ్వేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా దానిని తమ మిత్రులకు షేర్ చేస్తున్నారు. వెరసి ఈ పోస్ట్ ఇప్పుడు అన్నింటికంటే కూడా వైరల్ పోస్ట్ గా మారిపోయింది. రాజధాని అమరావతి బదులుగా మూడు ప్రాంతాల్లో రాజధానిని అభివృద్ధి చేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత, నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ లో ఏముందన్న విషయం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

"ఆంధ్రా పొడవునా సముద్రం ఉంది కాబట్టి, అసెంబ్లీ మరియు ప్రభుత్వ కార్యాలయాలు ఒక రెండు పెద్ద టైటానిక్ లాంటి షిప్స్ లో పెట్టి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నెలకు ఒకసారి అటూ ఇటూ తిప్పితే, రాజధాని అందరి దగ్గరకూ వచ్చినట్టుంది. అంతేకాకుండా ఒక ఫ్లోటింగ్ కాపిటల్ గా ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. ఎవరి భూములూ, రియల్ ఎస్టేట్లు అవసరం లేదు. ఏమంటారూ?" అంటూ సాగిన ఈ పోస్ట్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ పక్క రాజధానిపై ఓ పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంటే... మరోపక్క కడుపుబ్బా నవ్విస్తున్న ఈ పోస్ట్ కూడా అంతే స్థాయిలో తెగ వైరల్ అవుతోంది.