జగన్ కు సెగ తగిలింది... మొండి పట్టు వదిలాడు

December 06, 2019

ఇసుక... తెలుగుదేశాన్ని బదనాం చేయడానికి జగన్ వాడిన అస్త్రం. ఇపుడు అదే అస్త్రం జగన్ పై దాడి చేసింది. ప్రతిపక్షాలు చేసే ఏ ఆరోపణను పట్టించుకోకుండా చెవుల్లో సీసం పోసుకున్నట్టు అసలు తనకేం వినబడనట్టు ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్ చివరకు తన మొండిపట్టు వీడాల్సి వచ్చింది. ఇసుక సెగ తగిలింది. రాష్ట్రంలో వచ్చిన ఇసుక తుపాను దాటికి వైకాపా విలవిల్లాడిపోయింది. ఇసుక కొరత ఆత్మహత్యల దాకా దారితీయడంతో ఇక చేసేదేమీ జగన్ ఇసుక కొరతను పరిష్కరించడానికి మార్గాలు వెతకమని సమీక్ష పెట్టి మరీ అధికారులను ఆదేశించారు. 

వచ్చే నెలలో ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తాం అని జగన్ స్వయంగా చెప్పారంటే... ఏ స్థాయిలో జగన్ ఇరుకున పడ్డారో సులువుగా అర్థమవుతోంది. తన హయాంలో ఇసుక కొరత రావడానికి కారణం వైకాపా నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడమే కారణమని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కూలీలు వెతలు పెరగడంతో ఇసుక వల్ల నిర్మాణ రంగ పరిశ్రమలు, వ్యాపారాలన్నీ చతికిలపడ్డాయి. ఏకంగా ప్రభుత్వ ఆదాయమే పడిపోయింది. రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి పహారా కాయాలని జగన్ ఆదేశించారంటే... ఇసుక అక్రమ తరలింపు జరుగుతోందని ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నట్టే.

మొదటి సారి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులపై చంద్రబాబు పోరాటంతో నోరు విప్పకుండా పరోక్షంగా వెనక్కు తగ్గిన జగన్.. ఇసుక విషయానికి వచ్చేటప్పటికి పూర్థి స్థాయిలో తన పట్టువీడారు. ఇసుక కొరతను అంగీకరించారు. వెంటనే నష్టనివారణ చర్యలకు ఆదేశించారు. పార్టీని ఇసుక తుపాను నుంచి కాపాడమని అధికారులకు సూచించారు. 

కొన్ని రోజులుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇసుకపై చేస్తున్న రాజకీయ పోరాటాలకు వైకాపా వణికిపోయింది. రేపు నారా లోకేష్ నిరసన దీక్ష, 3న విశాఖలో ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ కు జనసేన పిలుపు నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం దిగిరావడం ప్రతిపక్షాలకు మంచి మైలేజీ తెచ్చిపెట్టింది.