వరద గుట్టు విప్పిన చంద్రబాబు

July 09, 2020

ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలను ముంచేసిన వరదలు నిజంగానే జగన్ సర్కారు సృష్టించిన కృత్రిమ వరదలనే మాట బాగానే వినిపిస్తోంది. ఇది ఎంతమాత్రం అసత్యం కాదు. ఈ మాట అసత్యం ఎలా కాదన్న విషయాన్ని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కళ్లకు కట్టినట్టు చెప్పేశారు. పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు... సరిగ్గా వరదలకు ముందు స్వల్ప అస్వస్థత కారణంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. చంద్రబాబు అటు హైదరాబాద్ వెళ్లగానే... ఇటు ఎగువ రాష్ట్రాల నుంచి ఒక్కసారిగా తరలివచ్చిన భారీ వరద నీరు కృష్ణా జిల్లాలోని ప్రధాన నగరం విజయవాడతో పాటు కృష్ణా పరివాహకంలోని ప్రాంతాలను ముంచెత్తించింది. విజయవాడలో చాలా ఇళ్లు నీట మునిగాయి. వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

అసలు మన రాష్ట్రంలో వర్షాలు లేకున్నా, సగలు వర్షపాతం కంటే కూడా తక్కువే వర్షాలు పడ్డా... ఇంత పెద్ద ఎత్తున, కృష్ణాకు రికార్డు స్థాయి వరద ఎందుకు వచ్చింది? ఇక్కడే జగన్ సర్కారు వ్యవహరించిన తీరు బయటకు వచ్చేసింది. కృష్ణా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను అద్దెకు తీసుకున్న చంద్రబాబు అందులోనే ఉంటున్నారు కదా. జగన్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబును ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించేందుకు వైసీపీ సర్కారు చేయని యత్నమంటూ లేదు. ఈ క్రమంలోనే ఎలాగూ ఎగువ రాష్ట్రాల నుంచి భారీ వరద వస్తోంది కదా. ఆ వరద నీటిని వచ్చినదాన్ని వచ్చినట్టుగా కిందకు వదలకుండా... ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరేలా వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరిగితే... వరద నీరు చంద్రబాబు ఇంటిని ముంచేస్తుందని వైసీపీ అంచనా. అయితే ఆ వరద నీటిని ఒక్కసారిగా కిందకు వదిలితే జరిగే నష్టం ఏమిటో జగన్ సర్కారు అంచనా వేయలేకపోయింది. అంచనా వేసినా కూడా చంద్రబాబు ఇంటిని ముంచేయాలంటే ప్రజలు ఇబ్బంది పడ్డా ఫరవా లేదని భావించింది. ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీలో వరద నీరు ప్రమాద స్థితికి చేరేదాకా చోద్యం చూసిన వైసీపీ సర్కారు... ఇంకా వెయిట్ చేస్తే కుదరదనుకుని నీటిని ఒక్కసారిగా కిందకు వదిలేసింది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు ఓ మోస్తరులో వెల్లడించినా... మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు చాలా క్లారిటీగా వైసీపీ కుట్రను బయటపెట్టేశారు.

కేవలం తనను టార్గెట్ చేసుకుని, తాను ఉంటున్న ఇంటిని వరదలో ముంచేయాలని వైసీపీ కుట్ర పన్నిందని, ఆ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతున్నా... నీటిని కిందకు వదలలేదని ఆయన చెప్పారు. కేంద్ర జలసంఘం వద్ద ఆయా ప్రాజెక్టుల సామర్థ్యం, ప్రస్తుతం ఆయా ప్రాజెక్టులో ఎంతమేర నీరుందన్న లెక్కలు ఉంటాయని, వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన వైసీపీ ప్రభుత్వం కేవలం తన అద్దె ఇంటిని ముంచేయడమే లక్ష్యంగా సాగి వరదలను తెచ్చిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ వరదలు జగన్ సర్కారు సృష్టించిన కృత్రిమ వరదలేనని చంద్రబాబు తేల్చేశారు. నిజమే మరి... ఏపీలోగానీ, తెలంగాణలో గానీ పెద్దగా వర్షాలే లేకున్నా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఏపీలో ప్రత్యేకించి విజయవాడలో వరదలు రావడమంటే మాటలు కాదు కదా. సో... ఈ వరదలు జగన్ సర్కారు సృష్టించిన కృత్రిమ వరదలే. చంద్రబాబు ప్రసంగమే ఇందుకు నిదర్శనం.