జగన్ ప్లాన్ గురించి బైరెడ్డి చెప్పిన సీక్రెట్స్

February 24, 2020

మనమంతా అమాయకులం. ఇపుడు విశాఖను కూడా ఒక రాజధాని గా ప్రకటించారని భావిస్తున్నాం. కానీ విశాఖ విషయంలో జగన్ యాక్షన్ ప్లాన్ ఎపుడో రెడీ అయిపోయిందని సీనియర్ రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి వెల్లడించారు. జగన్ దృష్టిలో విశాఖ మాత్రమే రాజధాని. పైకి మాత్రం మూడు రాజధానులు. ఇదేమీ తాజాగా వేసిన ప్లాన్ కాదు. ఎన్నికలకు ముందే రెడీ అయిపోయింది. ఈ ఉద్దేశంతోనే వైజాగ్ నగరంపై జగన్ ఎప్పటినుంచో అధ్యయనం చేస్తున్నారు.

లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది నిరుపయోగం అని.. అది తోక మీద వెంట్రుక వంటిదని అన్నారు. వైజాగ్ లో తల ఉంది. మాకు తోక మీద వెంట్రుక ఇచ్చారు. జగన్ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో రాజధాని వైజాగ్ మాత్రమే మరేమీ కాదు అని బైరెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు సిగ్గులేకుండా రాయలసీమలో రాజధాని ఏర్పాటుచేయాలని ఇపుడు లేఖలు రాస్తున్నారు. ఆనాడు రాయలసీమ కోసం పోరాడదాం అని తాను ఉద్యమిస్తే వీళ్లు రాలేదు. ఆనాడో కలిసి ఉద్యమించి ఉంటే రాష్ట్రం విడిపోయేదా? అని బైరెడ్డి ప్రశ్నించారు. 

జగన్ కేవలం ఓట్లు వేయరు అనే ఉద్దేశంతోనే అమరావతికి ఓకే చెప్పారు. జగన్ మనసులో ఏనాడూ అమరావతి లేదు. కోస్తాంధ్ర ఓట్ల కోసం ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. ఇపుడు కోస్తాంధ్రను బంగాళాఖాతంలో కలిపేస్తున్నాడు. వైజాగ్ లో ప్రతి అంగుళంపై పట్టు సాధించారు వైసీపీ వాళ్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుకుని.. అన్ని రంగాల్లో ఎక్కడెక్కడ ఏమేం చేయాలని ప్లాన్ కూడా గీసుకున్నారు. కోసాంధ్రను వాడుకుని, రాయలసీమకు ముష్టిపడేసి తమ అరాచక సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి వైజాగ్ పై కన్నేశారు అని బైరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికోసం జగన్ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి అక్కడ తిష్టవేశారు. పూర్తిగా అధ్యయనం చేశారు. ఆ రిపోర్టు తర్వాతే జగన్ వైజాగ్ ప్లాన్ రెడీ చేశారు అని ఆయన వెల్లడించారు.