జగన్ ఓటుకే ఎసరు.. అసలు విషయం తెలిసి షాక్

July 20, 2019

ఓట్ల తొలగింపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి చేరింది. ఇదే సమయంలో డేటా చోరీ వ్యవహారం దీనికి మరింత ఆద్యం పోసింది. ఈ వ్యవహారంలో రెండు ప్రభుత్వాలు సిట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా చెబుతున్న అశోక్ ఆచూకీ ఇంకా దొరకలేదు. కానీ, కొద్దిరోజుల కిందట మాదాపూర్‌లోని ఆయనకు సంబంధించిన ఐటీ గ్రిడ్స్‌, బ్లూఫ్రాగ్‌ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి అక్కడి నుంచి కీలక పత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణకు చెందిన సిట్ అధికారులు ఆయనకు రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు పోటా పోటీగా ఆరోపణలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ లోపు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా దీన్ని లైట్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఓ పరిణామం కలకలం రేపింది. ఇది ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించినది కావడంతో హాట్ టాపిక్ అయింది.

 

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టారు. వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్‌ జగన్‌ పేరు మీద ఈనెల 9వ తేదీన దరఖాస్తు దాఖలయ్యింది. ఈ విషయాన్ని పులివెందుల ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘‘పులివెందులలోని 134 బాకరాపురం పోలింగ్‌ కేంద్రంలో జగన్‌కు ఓటు హక్కు ఉంది. ఈ ఓటును తొలగించాలని జగనే స్వయంగా దరఖాస్తు చేసుకున్నట్లు ఫామ్‌-7లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు వచ్చింది. దీనిని చూడగానే జగన్‌ బంధువైన జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చాం. ఆయన జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్‌ రెడ్డికి తెలియజేశారు’’ అని ఆయన వివరించారు. అయితే, దీనికి ఓటు తీసేయాలని తాను ఫామ్‌-7 దరఖాస్తు చేయలేదని జగన్‌ సమాధానం ఇచ్చారని కూడా తెలిపారు. మరోవైపు, దీనిని ఎవరో ఆకతాయిలు చేసుంటారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో జగన్‌ తరపున కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దరఖాస్తు చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.