దుర్మార్గం.. ఎయిర్ పోర్టుల నుంచి అలా తప్పించుకున్నారు

August 11, 2020

విన్నంతనే ఉలిక్కిపడే నిజం ఒకటి బయటకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా యావత్ దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో లేదు. విదేశాల నుంచి వచ్చిన మనోళ్లు.. ఇతరుల కారణంగా మన దేశానికి దిగుమతి అయ్యింది. అయితే.. ఈ వైరస్ ను భారత్ లోకి తీసుకురావటంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో.. అందునా ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన వారి కారణంగా వ్యాప్తి చెందుతోందన్న చేదు నిజం కొన్ని కేసుల్ని చూస్తే క్లారిటీ రాక మానదు.
ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకుల విషయాన్నే తీసుకుంటే.. వారు భారత్ కు ల్యాండ్ కావటానికి కాస్త ముందుగా.. పారాసిటమాల్ మందుబిళ్లలు వేసుకోవటంతో.. థర్మల్ స్కాన్ లలో పట్టుబడకుండా వారు విమానాశ్రయం నుంచి తప్పించుకోగలిగారు. నిజానికి.. వారే కాదు.. విదేశాల నుంచి దేశంలోకి అడుగు పెట్టిన మనోళ్లు పలువురు ఇలాంటి తప్పులే చేసినట్లుగా చెబుతున్నారు.
సెల్ఫ్ డిక్లరేషన్ లో తమకు ఎలాంటి జబ్బులు లేవని చెబుతూ తప్పించుకుంటున్నారు. క్వారంటైన్ లో ఎక్కువ రోజులు ఉండాలన్న భయంతో అబద్ధాలు చెబుతున్న వారు.. ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులు.. బంధు మిత్రులకు అంటిస్తానన్న కనీస ఆలోచన లేకుండా బాధత్యారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఈ కారణంతో ఇప్పుడు వైరస్ ఇంటి పక్కనే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఒక అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 37 వేల మంది వరకూ విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. మార్చి ఒకటి నుంచి విమాన రాకపోకలు నిలిచే వరకూ ఫారిన్ నుంచి వచ్చినోళ్ల సంఖ్య దీనికి కాస్త ఎక్కువ ఉన్నా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉండదు. చదువు.. సంధ్య ఉన్న వారు కూడా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడటం అవాక్కు అయ్యేలా చేయకమానదు. అందుకే.. విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండటం చాలా అవసరం.