చంద్రబాబును ఎలా టార్గెట్ చేశారంటే..

May 23, 2020

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప‌ద‌వి నుంచి దిగిపోయిన స్వ‌ల్ప కాలంలోనే ఆయ‌న‌కు ఊహించ‌ని చేదు అనుభ‌వాలు ఎదురవుతున్నాయి. ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి రూపంలో ఈ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయంటున్నారు. ప్ర‌ధానంగా ఏపీలో అధికారం చేప‌ట్టిన కొత్త ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవం కల్పించడం లేదన్న ఆవేదన ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. దీనికి తోడుగా ఆయా పరిణామాల‌ను విశ్లేషించిన నేత‌లు సైతం...అదే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.
చంద్ర‌బాబుకు జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉంది. దేశంలో ఈ భ‌ద్ర‌త ఉన్న అతికొద్దిమందిలో ఆయ‌న ఒక‌రు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జి-1, 2 ఇలా మొత్తం 8 వాహనాలు ఆయన కాన్వాయ్‌లో ఉండాలి. ఈ కాన్వాయ్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్న సెక్యూరిటీ ఎస్‌ఆర్‌టిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఇటీవ‌ల ఆయనకు ఎస్కార్ట్‌, పైలెట్‌ వాహనాన్ని తొలగించారు. చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు చేయాలంటే ఎస్‌ఆర్‌టిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, దీనికి భిన్నంగా ఎస్కార్ట్‌, పైలెట్‌ వాహనాలను తప్పించారు. నిబంధ‌న‌లేమి పట్టకుండా కొందరు అధికారులు అత్యుత్సాహంతో చంద్ర బాబు కాన్వాయ్‌లో పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతో పా టు, ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వచ్చిన వాహనాన్ని మినహా మిగిలి న ఎస్కార్ట్‌ వాహనాలను అసెంబ్లి బయట పెట్టించడం వివాదాస్పదంగా మారింది.
దీనికి కొన‌సాగింపుగా తాజాగా గన్నవరం విమానాశ్రయంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.ఆయన వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయితే, చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లేమార్గంలో పంపిస్తూ తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో లాంజ్ నుండి విమానం వరకూ ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించారు. వీఐపీ, జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవటం పట్ల టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్ర‌బాబును ఉద్దేశ‌పూర్వ‌కంగా అవ‌మానించే ప్ర‌క్రియ‌లో ఇవి ప్రారంభంలోని సంఘ‌ట‌న‌లుగా భావించాలా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.