నిర్భయ దోషుల చివరి కోరిక ఇదే.. గురువారం రాత్రి జైల్లో ఏం జరిగిందంటే?

August 06, 2020

పైశాచికంగా వ్యవహరించిన నిర్భయ దోషులకు సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ రోజు తెల్లవారుజామున ఉరిశిక్షను అమలుచేశారు. నిర్భయ ఉదంతంలో దోషులైన వారిలో నలుగురి ఉరి తీయటానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జైలు బయట.. దోషులకు ఉరిని తప్పించటానికి.. కనీసం వాయిదా వేయటానికి వీలుగా వారి న్యాయవాదులు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టు తలుపు తట్టి.. అర్థరాత్రి 2.30 గంటల సమయంలోనూ ఉరి అమలు కాకుండా ఉండేందుకు వీలుగా పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే.. ఈసారి వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఇదిలా ఉంటే.. నిర్భయ దోషులు ఉన్న తీహార్ జైలు బయట పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు.దోషులకు శిక్ష అమలు కావాలన్న తాపత్రయం వారిలో కనిపించింది. ఇదిలా ఉంటే.. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కుమారుడికి పూరీ.. సబ్జి.. కచోరీ తినిపించాలని ఉన్నట్లు జైలు అధికారులకు చెప్పగా.. ఆ సమాచారాన్ని దోషికి అందించినట్లుగా తెలుస్తోంది.
బయట ఇలాంటి పరిస్థితి ఉంటే.. జైలు లోపల సీన్ మరోలా ఉంది. తమకు ఉరిశిక్ష అమలు కాకుండా ఉండేందుకు తమ లాయర్లు చివరి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. నిర్భయ దోషులు నలుగురు గురువారం రాత్రి నిద్ర పోలేదని చెబుతున్నారు. జైలులోని వేర్వేరు గదుల్లో నలుగురిని ఉంచారు. వారికి గురువారం రాత్రి మంచి భోజనం అందించారు. వారంతా నిద్ర లేని రాత్రులు గడిపారని.. జైలు గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయినట్లు చెబుతున్నారు. ఉరికి ముందు చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా? అని అడిగితే.. వారు ఎలాంటి కోరికలు కోరలేదని తీహార్ సెంట్రల్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. చివరి నిమిషాల్లో తమకు విధించే ఉరిశిక్ష ఆగుతుందన్నట్లుగా వారి తీరు ఉందని చెబుతున్నారు. అయితే.. సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చటంతో ఆ నలుగురికి తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్షను అమలు చేశారు. తలారి పవన్ ఒకేసారి లివర్ లాగటంతో.. ఉరి కంబానికి వారు వేలాడారు. వారంతా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించటంతో దారుణ నేరానికి పాల్పడ్డ నలుగురు నిర్భయ దోషుల జీవితం ముగిసినట్లైంది.