వైరల్ అవుతున్న లోకేష్ ’స్టాండప్ కామెడీ‘ పంచ్

July 06, 2020

ఏపీ రాజకీయం హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఏదో ఒక ఇష్యూ నిత్యం ఏపీ రాజకీయాల్ని రసవత్తరంగా చేస్తోంది. దీంతో.. పాలన మీద ఫోకస్ చేయాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్షం వేస్తున్న నిందలకు సమాధానాలు చెప్పటానికే సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. కియా మోటార్స్ ఏపీని వీడి వెళ్లిపోతుందంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థలో వచ్చిన వార్త పెను సంచలనంగా మారటమే కాదు.. లోక్ సభలో ఈ అంశంపై హాట్ చర్చ నడిచింది.
కియా వ్యవహారం ఇలా ఉండగా.. మరో కంపెనీ పేరు తెర మీదకు వచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పేరుతో బాబు భారీ స్కాంకు పాల్పడ్డారంటూ జగన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. విశాఖలో మిలీనియం టవర్స్ లో కంపెనీలు తరలిస్తున్నారన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బాబును టార్గెట్ చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే డమ్మీ కంపెనీని ఏర్పాటు చేసి రూ.30 కోట్ల పెట్టుబడులు పెట్టినందుకు ఆ కంపెనీకి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయిల విలువైన భూములు కట్టబెట్టారని ఆరోపించారు. ఇదో పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు.
దీనిపై చినబాబు అలియాస్ నారా లోకేశ్ స్పందించారు. మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటు రిప్లై ఇచ్చారు. ట్వీట్ తో పంచ్ మీద పంచ్ వేస్తూ.. వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘అది ఫ్లాంక్లిన్ టెంపుల్ టౌనో.. విలేజో కాదు మాష్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ చంద్రబాబు బినామీ కంపెనీ అని పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన స్టాండప్ కామెడీ నన్ను ఫిదా చేసింది’’ అంటూ ట్వీట్ పంచ్ వేశారు.
తాను చేసిన ట్వీట్ పంచ్ ను కొనసాగిస్తూ.. ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ కదా.. అలాంటి ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని వైఎస్ జగన్ గారిని నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీగారు. ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకు రావటం జగన్ కు మొదట్నించి ఇష్టం లేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యువతకు మంచి కంపెనీలో ఉద్యోగాలు రావటం జగన్ పార్టీ నేతలకు రుచించటం లేదన్నారు. ఉత్తరాంధ్ర ఎప్పటికి వెనుకబడి ఉండాలన్న దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కంపెనీలు జగన్ గారిని చూసి బై బై ఏపీ అంటున్నాయని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఒక అంతర్జాతీయ సంస్థను ఉద్దేశించి జగన్ పార్టీకి చెందిన ఎంపీ అంత తొందరపడి మాట అనే కన్నా.. ఆధారాలతో సహా విమర్శలు చేసి ఉంటే బాగుండదేన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.