ర్యాపిడ్‌ కిట్లలో స్వాహా!

August 07, 2020

ఛత్తీ్‌సగఢ్‌ కంటే అధిక ధరకు కొనుగోలు
సండోర్‌ సంస్థ ద్వారా హడావుడిగా సేకరణ
ఒక్కోదానికి రూ.337 బదులు 730 చెల్లింపు
షార్ట్‌టర్మ్‌ టెండర్లకు వెళ్లకుండా ‘ఆర్డర్లు’
కేంద్రం కంటే తక్కువకే కొన్నామన్న సీఎం
అనుభవం లేని కంపెనీ నుంచి శానిటైజర్‌
అప్పటికప్పుడు లైసెన్సు తెచ్చుకున్న సంస్థ
మాస్కుల కొనుగోళ్లలోనూ కక్కుర్తి
నాసిరకం వస్త్రం. కిరోసిన్‌ కంపు

నవ్యాంధ్రలో కరోనా విజృంభణ మాటేమో గానీ.. అధికారంలోని పెద్దలు మాత్రం దానిని లాభసాటిగా మార్చుకుంటున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, మాస్కులు, శానిటైజర్లను అధిక ధరకు కొన్నట్లు చూపి ప్రజాధనం స్వాహా చేస్తున్నారు. కరోనా నిర్ధారణకు ఉపకరిస్తాయంటూ హడావుడిగా అధిక ధరకు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఒక్కో కిట్‌ను రూ.337కి కొంటే.. జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.730 చెల్లించేసింది. దక్షిణకొరియా కంపెనీ నుంచి నేరుగా కొనే వీలుండగా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సంబంధం ఉన్న సండోర్‌ కంపెనీ (హైదరాబాద్‌) ద్వారా రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కొనుగోలుచేశారు.

ఈ విషయాలన్నీ బహిర్గతమయ్యేసరికి తాము ఒప్పందంలో కొత్త షరతు పెట్టామని.. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదని సీఎం జగన్‌ నుంచి అధికారుల వరకు మొండివాదన చేస్తున్నారు. ‘ర్యాపిడ్‌ కిట్లకోసం ఆర్డర్‌ ఇచ్చినప్పుడే మన అధికారులు ఒక షరతు పెట్టారు. ఒకవేళ ఇంతకంటే తక్కువకు ఏ రాష్ట్రానికైనా విక్రయిస్తే... అదే ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి ఆలోచన ఎవరూ చేయరు. ఎలాంటి రాజీ పడకుండానే కిట్లను వేగంగా తెప్పించుకోవడంలో ఆలస్యం చేయకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయం’ అని జగన్‌ అధికారులను ఆకాశానికెత్తేశారు.

 

సాధారణంగా ఇలాంటి ఆలోచన ఎవరూ చేయరు అనే ఒక్క వాక్యం చదివితే, అబ్బబ్బ.. ఇది నెవ్వర్‌ బిఫోర్‌...నెవ్వర్‌ ఆఫ్టర్‌ అనే సినిమా డైలాగ్‌ గుర్తుకు వస్తోంది కదా! అయితే.. ఎవరికైనా తక్కువ ధరకు విక్రయిస్తే తామూ అదే ధర చెల్లిస్తామని షరతు పెట్టడం కొత్తదేమీ కాదు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) సిఫారసు మేరకు... 2015 సెప్టెంబరులోనే వైద్య పరికరాలు, మందుల  కొనుగోలు ఒప్పందాల్లో ఈ నిబంధన చేర్చారు. కాంట్రాక్టు పొందిన వ్యక్తి/సంస్థ నుంచి దీనిపై సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుంటారు. ‘ఇంతకంటే తక్కువ ధరకు ఇతర రాషా్ట్రలు,  సంస్థలు, వ్యక్తులకు సరఫరా చేయడం లేదు. ఒకవేళ మేం అలా చేసినట్లుగా నిర్ధారణ అయితే... అదనపు మొత్తాన్ని మాకు చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకోవచ్చు’ అని సదరు కంపెనీ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది.

అనేక కంపెనీలు, పంపిణీదారులు మందులు, పరికరాలను  ప్రభుత్వానికి ఎక్కువ ధరకు కట్టబెట్టి... ప్రైవేటు సంస్థలకు తక్కువకే ఇస్తున్నారన్న ఫిర్యాదులపై గతంలో సీవీసీ విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చింది. కంపెనీలను దారికి తీసుకొచ్చేందుకు ఈ నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు, సదరు కంపెనీ ఇకపై టెండర్లలో పాల్గొనకుండా నిషేధం కూడా విధిస్తారు. దేశంలోని అనేక రాషా్ట్రలు సీవీసీ సిఫారసు చేసిన ఈ నిబంధనను ఒప్పందాల్లో భాగం చేశాయి. ఏపీలోనూ అదే అమలవుతోంది. కానీ... కొత్తగా కరోనా ర్యాపిడ్‌ కిట్ల విషయంలోనే ఈ నిబంధన తెచ్చినట్లు వైసీపీ నేతలు చెప్పుకోవడం గమనార్హం.

ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం నేరుగా తయారీదారు నుంచి ర్యాపిడ్‌ కిట్లను కొనుగోలు చేసింది. మన రాష్ట్రంలో ఏపీఎంఎ్‌సఐడీసీ (వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) మాత్రం హైదరాబాద్‌లోని ‘సండూర్‌’ అనే ఏజెన్సీ ద్వారా కొనుగోళ్లు జరిపింది.

ఈ ఆర్డర్‌ కాపీని పరిశీలిస్తే చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వెసులుబాటు కల్పించినట్లుగా  కనిపిస్తోంది.  ‘‘మాకు సరఫరా చేసిన ధర కంటే తక్కువకు ఇతరులకు ఇచ్చినట్లు మా దృష్టికి  వస్తే, ఆ మొత్తం భారాన్ని పంపిణీదారుకు చెల్లించే దాంట్లో నుంచి రికవరీ చేసుకుంటాం. లేదా వీలైన ఇతర మార్గాలను ఎంచుకుంటాం. అలాగే, సరైన ప్రామాణికత లేని పరికరాలను సరఫరా చేస్తే సంబంధిత ఉత్పత్తిపై మూడేళ్లపాటు నిషేధం విధిస్తాం’’ అని ఉంది.  

నిజానికి, ఇతర రాషా్ట్రలకంటే ఎక్కువ ధరకు ఏపీకి సరఫరా చేస్తే ఆ కంపెనీపై మూడేళ్ల నిషేధం కూడా విధించాలి. అలా కాకుండా, సరైన ప్రమాణాలు లేకపోతేనే నిషేధం ఉంటుందంటూ వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ఏపీఎంఎ్‌సఐడీసీ సుమారు రూ.500 కోట్ల విలువైన వేర్వేరు ఉపకరణాలను కొనుగోలు చేసింది. వీటిలో సుమారు రూ.260 కోట్ల విలువైన సర్జికల్‌ ఐటమ్స్‌, డ్రగ్స్‌ ఉండగా... మరో రూ.220 కోట్ల విలువైన వైద్య సామగ్రి కొనుగోలుకు అర్డర్లు ఇచ్చారు. వీటిలో ఎక్కడా ప్రాథమిక నిబఽంధనలు కూడా పాటించలేదు. నచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చుకున్నారు.

ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలులో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఈ కిట్లతోపాటు శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర ఎక్వి్‌పమెంట్‌కు మాన్యువల్‌గా ఆర్డర్లు ఇచ్చేశారు. దీని వెనుక భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


షార్ట్‌ టర్మ్‌ టెండర్లను వదిలేశారు...
కరోనా నివారణకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సి రావడం నిజమే. ఇది మన ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. వైద్య ఉపకరణాల కోసం దాదాపు అన్ని రాషా్ట్రలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు నిబంధనల ప్రకారమే వాటిని కొనుగోలు చేస్తున్నాయి. అవసరమైన సామగ్రిని రేట్‌ కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీలు సరఫరా చేయలేని పక్షంలో... చాలా రాషా్ట్రలు షార్ట్‌ టర్మ్‌ టెండర్లకు వెళ్తున్నాయి.

ఉదాహరణకు... ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం షార్ట్‌ టర్మ్‌ టెండర్ల ద్వారానే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను కొనుగోలు చేసింది. ఈ టెండర్లలో 14 కంపెనీలు  పాల్గొన్నాయి. రూ.337 చొప్పున సుమారు 75 వేల కిట్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. చాలా రాషా్ట్రలు చిన్న చిన్న వస్తువుల కోసం కూడా షార్ట్‌ టర్మ్‌ టెండర్లకు వెళ్తున్నాయి. ఈ టెండర్లకు ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం ఒకటి రెండు రోజుల్లో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.  ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు మాత్రం ఇదేదో పెద్ద సమస్యగా భావించి, టెండర్‌ ప్రక్రియ లేకుండానే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు.


రాష్ట్రంలో శానిటైజర్‌ను రెండు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో రాయలసీమకు చెందిన ఒక కంపెనీకి రూ.3 కోట్ల విలువైన ఆర్డర్‌ను అధికారులు ఇచ్చారు. ఈ కంపెనీకి గతంలో ఎప్పుడూ శానిటైజర్‌ తయారు చేసిన అనుభవం లేదు. అప్పటికప్పుడు డ్రగ్స్‌ విభాగం నుంచి లైసెన్స్‌ సంపాదించి, ఆ వెంటనే ఆర్డర్‌ తీసుకున్నారు. స్వయంగా జిల్లా మంత్రి ఆదేశాలతో నిబంధనలు పట్టించుకోకుండా ఆ కంపెనీకి భారీగా అర్డర్లు ఇచ్చేశారు.

బయట మార్కెట్‌లో రూ.4, రూ.5 ధర ఉండే  మాస్కులను రూ.7 నుంచి రూ.10 ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విజయవాడకు చెందిన ఒక కంపెనీకి మాస్కులకు సంబంధించి ఆర్డర్‌ ఇచ్చారు. ఆ కంపెనీ సరఫరా చేసే మాస్కు ధర బయట మార్కెట్‌లో రూ.1.50 ఉంటుంది. ఇప్పుడు డిమాండ్‌ నేపథ్యంలో రూ.3 నుంచి రూ.4కు కొనుగోలు చేయవచ్చు. కానీ, రూ.8 చొప్పున కొంటున్నారు.


నాసిరకం మాస్కులు..
కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీ ఇప్పటి వరకు దాదాపు ఐదు కోట్ల మాస్కులు కొనుగోలు చేసింది. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం మూడు ప్లై మాస్కులుండాలి, నోస్‌ పిన్‌ కచ్చితంగా ఉండాలి. మాస్కు కోసం వాడే మెటీరియల్‌ నాణ్యంగా ఉండాలి. కానీ ఏపీఎంఎస్‌ఐడీసీ కొనుగోలు చేసిన మాస్కులు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని, నోస్‌పిన్‌ లేదని, ఆ మాస్కులకు 3 ప్లై లు లేవని, వాడిన మెటీరియల్‌ కూడా అంత నాణ్యంగా లేకపోవడంతో కిరోసిన్‌ వాసన వస్తోందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రానికి కిట్లు అత్యవసరమని కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి ఉందని.. బయటటి మార్కెట్లో కొనుక్కోమని చెప్పిందని సీఎం అన్నారు. ఐసీఎంఆర్‌ ఒక్కో కిట్‌ కొనుగోలుకు రూ.795 చొప్పున ఆర్డర్‌ ఇస్తే.. అది తెలిసి కూడా రూ.65 తక్కువ రేటుకు మన అధికారులు ఆర్డరిచ్చారని చెప్పారు. అంటే కేంద్రమే అధిక ధరకు కొనుగోలుచేసిందని పరోక్షంగా నెపం మోపారన్న మాట. కానీ ఈ కిట్లు పనికిరావని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. పీసీఆర్‌ పరీక్షలతోనే కరోనా నిర్ధారణ అవుతుందని తేల్చిచెప్పింది. కొన్నారుకాబట్టి వాటితో పరీక్షలు చేయవచ్చని.. కానీ అది తుది ఫలితం కాదని.. పీసీఆర్‌ పరీక్షల్లో తేలిందే నిజమని తెగేసిచెప్పడం విశేషం.

కాగా.. రాష్ట్రంలోని ప్రజలందరికీ మనిషికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించారు. అవి గానీ.. వైద్య సిబ్బందికి సమకూర్చాల్సిన పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలు గానీ ఎవరికి అందాయో అధికారులకే తెలియాలి.


ర్యాపిడ్‌లో నెగెటివ్‌.. శ్వాబ్‌ పరీక్షలో పాజిటివ్‌!
విజయవాడలోని ఓ పోలీసు స్టేషన సిబ్బంది ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. శ్వాబ్‌ పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌ అని తేలింది. ఆ స్టేషన్‌లో మొత్తం 96 మంది సిబ్బంది ఉన్నారు.

వారిలో 40మంది ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. వీరంతా విజయవాడ కొవిడ్‌ ఆస్పత్రిలో శ్వాబ్‌ పరీక్షలు చేయించుకుంటే ఓ మహిళా ఎస్సై సహా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది.