ఆ పనిచేస్తే రైల్వే ఫ్లాట్ ఫాం టిక్కెట్ ఫ్రీ

August 10, 2020

పండుగ స‌మయాల్లో రైళ్ల‌తో పాటు రైల్వే స్టేష‌న్ల‌లో ఉండే ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మ వారికి వీడ్కోలు ప‌లికేందుకు స్టేష‌న్‌కు వ‌చ్చే వారి సంఖ్య ....ప్లాట్‌ఫాంపై ప్ర‌యాణికుల సంఖ్య‌తో పోటీప‌డుతుంటుంది. అందుకే, పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీని నియంత్రించడానికి ప్లాట్ ఫాం టికెట్ రేటు అమాంతం పెంచేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ప్లాట్ టికెట్ కోసం చాంతాడంత క్యూ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఆ క్యూలో టికెట్ సాధిస్తే....కేజీఎఫ్‌-2 ఫ‌స్ట్ షో టికెట్ సాధించిన‌ట్లే. అయితే, ఇక‌పై ప్లాట్‌ఫాం టికెట్ కోసం ప‌డిగాపులు ప‌డ‌న‌క్క‌ర‌లేదు. రైల్వే స్టేషన్‌లోని ఫిట్‌నెస్ మెషీన్ ముందు సిట‌ప్స్ చేస్తే చాలు...ఎంచ‌క్కా ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ పొంద‌వ‌చ్చు. ఈ సిట‌ప్స్ వీడియోను రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్వీట్ చేయ‌గా అది వైర‌ల్ అయింది.

ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఫిట్ నెస్ ఫిట్ నెస్ మెషీన్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారింది. జిమ్ లో ఉండాల్సిన మెషీన్ ఇక్క‌డుందేమిటని ప‌లువురు ప్ర‌యాణికులు ఆశ్చర్యపోయారు. అయితే, ఆ మెషీన్ ముందు సిట‌ప్స్ చేస్తే ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్ పొంద‌వ‌చ్చ‌ని తెలియ‌డంతో సిట‌ప్స్ చేసేందుకు పోటీప‌డుతున్నారు. ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే ఆ యంత్రం ఏర్పాటు వెనుక ఉద్దేశం. ఇదే సొమ్ము ఆదాతోపాటు ఆరోగ్యం...అంటూ ఈ వీడియోను  పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. కాగా, రష్యాలోని మాస్కో రైల్వే స్టేష‌న్లో ఈ విధానం ఎప్పటినుంచో అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. ఆనంద్ విహార్ స్టేష‌న్ల‌లోని సిట‌ప్స్ ఎన్ని అనే దానిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.