పచ్చి మోసం... పెద్ద డ్రామా !!

July 13, 2020

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు చూశాం. తాజాగా ఇంకో ఉదాహరణ బయటపడింది. టీఆర్ఎస్ లీడర్ కోనేరు కృష్ణారావు ఆయన అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత గుర్తుందా? ఆమెను ఇపుడు కేసీఆర్ సార్ బదిలీ చేశారు. ఇది గిఫ్ట్ అన్నమాట. పోనీ ఆమెకు పదోన్నతి ఇచ్చి బదిలీ చేశారేమో అనుకునేరు... అదేం కాదు. కేవల బదిలీయే. సాధారణంగా గవర్నమెంటులో 3 సంవత్సరాలు, లేదా ఐదు సంవత్సరాలు సాధారణ బదిలీలు జరుగుతాయి. కానీ ఆమెను మాత్రమే ఏడాదిన్నరకే బదిలీ చేశారు. ఆమెను ఒక్కటే బదిలీ చేస్తే చిక్కొచ్చిపడుతుంది అని  మరో ఫారెస్ట్ డివిజన్ అధికారులను, అనితతో కలిపి ఐదుగురు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ట్విస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. 

ఆరోజు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు అయిన నిందితుడు కోనేరు కృష్ణారావు రాజీనామా చేయమని మన సీఎం సార్ ఆదేశించారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. జెడ్పీటీస్ పదవికి, జెడ్పీ వైఎస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అబ్బ... సార్ భలే పనిచేశారు. నిందితులను పీకి పడేశారు అనుకున్నారేమో. అలా అయితే... కేసీఆర్ స్పెషల్ ఏముంటుంది? యథావిధిగా ఆ వార్తను జనం మర్చిపోగానే రాజీనామా లేఖను ఆమోదించకుండా కృష్ణారావుకు రాజీనామాకు కారణం చెప్పమంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు. ఎందుకంటే ఆయన తన రాజీనామాను స్వయంగా పంపకుండా తన మనుషులతో పంపారట.. అనుమానం వచ్చి వారు నోటీసు ఇచ్చారట. నోటీసు పంపగా... సైలెంటుగా తన రాజీనామాను కోనేరు కృష్ణారావు ఉపసంహరించుకుని ఎంచక్కగా పదవి వెలగబెడుతున్నాడు. ఈ మేరకు ఒక తెలుగు ప్రధాన దినపత్రిక రాసింది. దెబ్బలు తిన్న అధికారి అనిత మాత్రం... మూడు నెలలు ఆ నొప్పి భరించి... ఇపుడు తాజాగా బదిలీ గిఫ్టుతో సంతోషంగా వెళ్తోంది. మరి ముఖ్యమంత్రి రాజీనామా చేయమని ఆదేశించినా... కోనేరు కృష్ణారావు లెక్క చేయడం లేదా? పార్టీలో కేసీఆర్ మాట చెల్లుబాటు కావడం లేదా? లేకపోతే కేవలం జనాల్లో సానుభూతి కోసం ఆడిన తాత్కాలిక రాజీనామా డ్రామానా ఇది? 

 
ఆ పాత దారుణ వీడియో మీకోసం మరోసారి..