జేసీ సీమలో పుట్టడం రాయలసీమ దురదృష్టమట

July 08, 2020

సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ లెక్కలు దాగి ఉంటాయి. మనసులోని మాటల్ని దాచుకోకుండా బయటకు చెప్పేసే రాజకీయ నాయకుల ఫ్యూచర్ చెప్పడంలో దిట్ట. 
ఆయన అక్రమ మైనింగ్ పై ఏపీ అధికారులు కొరడా ఝుళిపించిన తర్వాత ఆయన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద మరోసారి ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే. ఇలాంటివేళ.. జేసీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.
కల్లుతాగే జేసీ.. పొగరు వ్యక్తిగా అభివర్ణించారు. రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానించే రీతిలో మాట్లాడటం దారుణమన్న గడికోట.. సీమలో ఇలాంటి వారు పుట్టటం దురదృష్టకరమన్నారు. ఐదేళ్ల బాబు ప్రభుత్వంలో రాయలసీమకు ఏం చేశారో జేసీ చెప్పాలని సవాల్ విసిరారు.
అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీమవాసిగా తాను సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీమ ప్రజలు టీడీపీ నేతల్ని కచ్ఛితంగా అడ్డుకుంటారని.. ఫ్యాక్షనిస్టులు.. కడప రౌడీలు అంటూ బాబు అంటుంటే టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.
వందల ఏళ్లుగా రాయలసీమ ప్రజలు అనేక త్యాగాలు చేశారని ... 70 ఏళ్ల నాటి శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్ నిర్ణయిస్తే.. తప్పు పట్టటం ఏమిటని ప్రశ్నించారు. జేసీ దురుసు వ్యాఖ్యలపై సీమ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించిన శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.