ఇది చదివాక మీ భయం పోతుంది, డబ్బులు మిగులుతాయి

August 04, 2020

కరోనా అన్నంతనే ఉలిక్కిపడే వారిలో భారతీయులు చేరిపోయారు. చెంతనున్న చైనాలో వందలాది మంది మరణిస్తూ.. వేలాది మంది ఆ మాయదారి వైరస్ బారిన పడినప్పటికీ పెద్దగా పట్టనట్లుగా ఉన్నప్పటికీ.. దేశీయంగా ఈ వైరస్ కేసులు పాజిటివ్ వస్తున్న కొద్దీ భయాందోళనలకు గురవుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలి.. మరో రెండు కేసులు అనుమానాస్పదంగా ఉన్నాయన్న సమాచారం వచ్చినంతనే.. హైదరాబాదీయులు భయంతో ఎంతలా వణికారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే.. వారు భయపడినంతగా ఫలితాలు లేకపోగా.. అనుమానంగా ఉన్న రెండు కేసులు నెగిటివ్ అని తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ.. గతంలో మాదిరి తొందరపడి మాల్స్.. మల్టీఫ్లెక్సులకు.. బజార్లలోనూ తిరిగే విషయంలో ఆచితూచి అన్నట్లుగా ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఐటీ ఉద్యోగి నివాసమైన మహేంద్రహిల్స్ ప్రాంతం వైపు వెళ్లటానికి.. పొద్దున్నే వాకింగ్ చేయటానికి అస్సలు ఇష్టపడని పరిస్థితి నెలకొంది.
ఇలాంటివేళ.. కరోనా గురించి భారతీయులు కంగారు పడాల్సిన అవసరం లేదన్న మాటతో పాటు.. కరోనా బారిన పడే ప్రతి ఐదుగురి భారతీయుల్లో నలుగురికి ఎలాంటి ప్రమాదం ఉండదని.. పారాసిట్ మాల్ మాత్రతోనే తగ్గించొచ్చు అంటూ వ్యాఖ్యలు చేస్తున్న గగన్ దీప్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె మాటలకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయాల్లోకి వెళితే..  ఆమెను ఎందుకు నమ్మాలో ఇట్టే అర్థమైపోతుంది.
చిన్నారులు ఇంట్లో ఉన్నోళ్లతోపాటు.. మెడికల్ నాలెడ్జ్ కాస్త ఉన్న వారికి రోటా వైరస్ గురించి అంతో ఇంతో తెలిసే ఉంటుంది. భారత్ లో ఈ వైరస్ కారణంగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఏడాదికి లక్ష మంది వరకు మరణించే దుస్థితి. అలాంటి మహమ్మారిని అడ్డుకునేందుకు గగన్ దీప్ దేశీయంగా వ్యాక్సిన్ ను తయారు చేశారు. అంతేకాదు.. మలేరియా.. కలరాపై పోరాడేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు.
తమిళనాడులోని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్.. మైక్రోబయాలజీలో ఎండీ పూర్తి చేసిన ఆమె తర్వాత పీహెచ్ డీ పూర్తి చేశారు. డాక్టర్ గా కాకుండా పరిశోధనలపై ఫోకస్ పెట్టిన ఆమె.. పిల్లల ఉదర ఇన్ఫెక్షన్లు.. జీర్ణాశయ సమస్యలపై రీసెర్చ్ చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన పరిశోధనలకు ఫలితంగా 1998 నుంచి ఆమెకు అవార్డులు పెద్ద ఎత్తున వచ్చాయి.
350 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న లండన్ లోని ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయ మహిళ ఆమె మాత్రమే కావటం గమనార్హం. అలాంటి ఆమె.. కరోనా వైరస్ భారతీయుల్ని ఏమీ చేయలేదని.. జ్వరం ట్యాబ్లట్ తో దాన్ని లొంగ తీసుకునే సత్తా ఉందని చెబుతున్నారు. పెద్ద వయస్కులకు తప్పించి.. మిగిలిన భారతీయులు దాని గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న  ఆమె చెప్పిన తర్వాత కూడా కరోనా భయంతో మాస్కులు.. శానిటైజర్లు వాడాల్సిన అవసరం ఉందంటారా? కాస్తంత వ్యక్తిగత శుభ్రతతో వ్యవహరిస్తే చాలు.. కరోనాకు దూరంగా ఉండే వీలుందని చెప్పొచ్చు.