‘గాలి’ కడపకు మళ్లింది.. సుప్రీం అనుమతిస్తుందా?

February 22, 2020

గాలి జనార్దన రెడ్డి... పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలో పుట్టి కర్ణాటకకు వలస వెళ్లిన జనార్దన రెడ్డి... కన్నడ పాలిటిక్స్ లో బాగానే ఎదిగారు. గతంలో బీజేపీ అధికారంలో ఉండగా... ఏకంగా మంత్రి పదవినీ దక్కించుకున్నారు. అంతేనా... బళ్లారి ప్రాంతంలో నాడు జనార్దన రెడ్డి చెప్పిందే వేదం. సీఎం కూడా జనార్దన రెడ్డికి తెలియకుండా బళ్లారిలో కాలుమోపలేనంత పరిస్థితి. అంతేనా... నాడు ఉమ్మడి ఏపీకి సీఎంగా కొనసాగిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ సన్నిహిత సంబంధాలు నెరపిన జనార్దన రెడ్డి... వైఎస్ సొంత జిల్లా కడపలో ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు యత్నించారు. వైఎస్ బతికి ఉంటే.. కడపలో జనార్దన రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ బ్రాహ్మణీ స్టీల్స్ ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించి ఉండేది. సరే... ఇదంతా తెలిసిన విషయమే గానీ... ఇప్పుడు గాలి జనార్దన రెడ్డి ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం అక్రమ గనుల కేసులో బెయిల్ పై ఉన్న జనార్దన రెడ్డి... సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తాను కడప జిల్లాలో పర్యటిస్తానని, అందుకు అనుమతి ఇవ్వమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. 

గాలి జనార్దన రెడ్డి కోరిన ఈ కోర్కెలో అంత ప్రత్యేకత ఏముందంటారా? ఎందుకు లేదండీ బాబూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం కదా. అందునా... జగన్ ను గతంలో తన సోదరుడిగా కూడా జనార్దన రెడ్డి అభివర్ణించారు. మరి తనకు అత్యంత దగ్గరైన వ్యక్తి ఏపీకి సీఎంగా ఉన్నారు కాబట్టే... ఆ సీఎంగా ఉన్న తన సోదర సమానుడి జిల్లా కడపలో గాలి జనార్దన రెడ్డి పర్యటించాలని అనుకుంటున్నారేమో. ఈ విషయాన్ని అంతగా ప్రస్తావించని జనార్దన రెడ్డి... తన సొంతూరు బళ్లారితో పాటు కడప జిల్లాలోనూ తాను పర్యటించాలని అనుకుంటున్నానని, అందుకు అనుమతించాలని, అంతేకాకుండా తన బెయిల్ పై ఉన్న ఆంక్ష (బెంగళూరును విడిచి వెళ్లరాదు)ను శాశ్వతంగా తొలగించాలని కూడా జనార్దన రెడ్డి కోర్టుకు విన్నవించారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు... జనార్దన రెడ్డి అభ్యర్థనపై మీరేమంటారంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అయినా గాలి జనార్దన రెడ్డి తన పిటిషన్ లో తన కోర్కెలను సమర్థించుకుంటూ ఏం కారణాలను తెలియజేశారన్న విషయానికి వస్తే... బళ్లారి తన సొంతూరు అని, తన వ్యాపార కార్యకలాపాలు మొత్తం అక్కడి నుంచే కొనసాగుతున్నాయని, వాటిని పర్యవేక్షించేందుకే తాను బళ్లారి వెళ్లాలనుకుంటున్నానని జనార్దన రెడ్డి కోరారు. అయితే కడప జిల్లా పర్యటనకు సంబంధించిన కారణాలను మాత్రం జనార్దన రెడ్డి కోర్టుకు తెలిపినట్లుగా లేదు. గనుల అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత చాలా రోజులకు సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై జనార్దన రెడ్డి బయటకు వచ్చారు. అయితే బెంగళూరును విడిచివెళ్లరాదన్న కోర్టు ఆంక్షలతో జైలు నుంచి బయటకు వచ్చినా... బెంగళూరు దాటి జనార్దన రెడ్డి బయటకు రావడం లేదు. మరి జనార్దన రెడ్డి పిటిషన్ పై సీబీఐ ఏమంటుంందో? దానిపై సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇస్తుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.