పార్ల‌మెంటులో వైసీపీ దుమ్ము దులిపిన గల్లా!

May 26, 2020

లోక్ స‌భ సాక్షిగా వైసీపీ ప్ర‌భుత్వం దౌర్జ‌న్యాల‌ను టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఎండ‌గ‌ట్టారు. తనపై వైసీపీ ప్రభుత్వం భౌతిక దాడికి పాల్పడిందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. నోటీసుతో పాటు వివిధ దినపత్రికల్లో కథనాల క్లిప్పుంగులను కూడా అందజేశారు. ఒక ఎంపీ అయిన త‌న‌పై పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోపించారు. ఎంపీ హోదాలో ఉన్న త‌న‌కే ర‌క్ష‌ణ క‌రువైంద‌ని, ఇక సామాన్య రైతులు, ప్ర‌జ‌ల ప‌రిస్థితేమిట‌ని గ‌ల్లా వాపోయారు. పోలీస్ స్టేషన్‌లో తనను నిర్బంధించారని, రాత్రంతా పోలీసు వాహనాల్లో ప‌లు స్టేష‌న్ల‌కు తిప్పారని ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని పోలీసుల సాయంతో ప్రభుత్వం అణచివేస్తోందని స‌భాముఖంగా గ‌ల్లా తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు వెంటనే చర్యలను తీసుకోవాలని కోరారు. 
సీఎంగా జ‌గన్ ప్ర‌మాణ స్వీకారం చేసింది మొద‌లు ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌ల శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ నియంతృత్వ ధోర‌ణితో త‌మ‌ నిర‌స‌న‌లను అడ్డుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌లుమార్లు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా జరిగిన ఛలో అసెంబ్లీ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో త‌న‌పై భౌతిక దాడి జరిగిందని టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వమే ఈ దాడికి ప్రధాన కారణమని గ‌ల్లా ఆరోపించారు. తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ దాడి ఘ‌ట‌న‌ను గ‌ల్లా ప్ర‌స్తావించారు. వైసీపీ దాష్టీకాల‌ను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గ‌ల్లా....త‌న‌పై దాడికి కార‌కులైన వారిపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్పీక‌ర్‌ను కోరారు.