కేసీఆర్ ని తిడుతూ గాంధీ లేడీ డాక్టర్ వీడియో వైరల్

August 10, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరుపై గాంధీ ఆస్పత్రి మహిళా వైద్యురాలు విజయలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకష్టకు చేరిందని, ఒక హెల్త్ ఎమర్జెన్సీలో ఏ పనులు చేయకూడదో అవే చేస్తున్నారని అన్నారు. ఇపుడు ఆమె వీడియో వైరల్ అవుతోంది. 

తెలంగాణలో, దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న కరోనా సమయంలో పాత సచివాలయం వంటి ఒక పెద్ద భవంతిని అనవసరంగా కూల్చివేశారని, దానిని ఆస్పత్రిగా మలచిఉంటే ఎంతో అద్భుతగా ఉండేదని, ప్రభుత్వం ఎమర్జెన్సీ ఉన్నట్లు అంగీకరించకపోవడం వల్లనే ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. కూల్చడం వాయిదా వేసి దాన్ని ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిగా వాడుకోవాల్సిందని అన్నారు. కరోనా వల్ల సాధారణ ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు.

పాత సచివాలయాన్ని వాడుకుని ఉంటే అది పదివేల పడకల ఆస్పత్రి అయ్యేదన్నారు. లాక్ డౌన్ ప్రభావంతో నిన్నమొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంత ఖర్చు పెట్టి కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించాలనుకుంటుందని ప్రశ్నించారు. సచివాలయం వాస్తు బాగలేకుండానే  కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాారా అని ప్రశ్నించారు.

​వాయిదాలు వేస్తున్నారు గాని గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిని ​ ఎందుకు వాడుకోవడంలేదని ప్రశ్నించారు. కరోనా వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు ప్రైవేటు హస్పిటల్స్‌కు వెళ్తు​న్నారని, ప్రజలకు అది ఏ సంకేతాలు పంపుతోందని ప్రశ్నించారు. ​3 నెలలుగా కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తు​న్న గాంధీ ​వైద్యులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్లో మాత్రమే కరోనా పేషెంట్లకు చికిత్స ఎందుకు? ఆరోగ్యశ్రీతో ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందించొచ్చు.’’ అని సూచించారు. 

​ఇదిలా ఉండగా...  తెలంగాణ మరో ఇటలీ అవుతుందనడంలో సందేహం లేదని గత నెలలో​ చేసిన ఒక వీడియోలో ఇప్పటికే​ హెచ్చరించారు.​ ఆమె చెప్పినట్లే తర్వాత కేసులు పెరుగుతూ వచ్చాయి.​