కొనసాగుతున్న ‘గ్యాంగ్ లీడర్’ వార్..

December 05, 2019

ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ వార్ బలంగా సాగుతోంది. ఈ టైటిల్ మాదే! మా పర్మిషన్ లేకుండా హీరో నాని బర్త్‌డే రోజు మా టైటిల్‌తో పబ్లిసిటీ చేసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు నిర్మాత, హీరో మోహన కృష్ణ. ఈ టైటిల్ కి సంబంధించిన హక్కులన్నీ మాణిక్యం మూవీస్ బ్యానర్ కె చెందుతాయని ఆయన అంటున్నారు. నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ అనే టైటిల్ పెట్టి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే దీనిపై మోహన కృష్ణ ఆ టైటిల్ మాదంటూ మీడియా ముందుకొచ్చారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో ఆ టైటిల్ ని తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఆయన తెలిపారు. 

 

 

ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ ‘‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో ‘బావా మరదలు’ అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు ‘నాయుడు గారి అబ్బాయి’ నిర్మిస్తున్నాం. త్వరలోనే ‘గ్యాంగ్‌లీడర్’ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా చేస్తున్నాను. అలాగే నిర్మాతను కూడా నేనే. అక్టోబర్‌లో ‘గ్యాంగ్‌లీడర్’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌కు ప్లాన్ చేశాం. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తే లేదు.

 

 

టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు కాల్ చేశారు. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని వారితో చెప్పాను. అయినప్పటికీ హీరో నాని బర్త్‌డే రోజు మా టైటిల్‌తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్‌కు విరుద్దంగా టైటిల్‌ను ఎలా ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్‌లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్‌కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి‌ సినిమా టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్‌ని అవ్వాలని వచ్చాను. చిరంజీవి టైటిల్‌కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్‌గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు వంటి పెద్దలు కూడా మాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్‌తో కలిసి యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయబోతున్నాం’’ అన్నారు. 

RELATED ARTICLES

  • No related artciles found