మంత్రి కోసం లిఫ్టు బద్దలుకొట్టారు

July 12, 2020

కారణం ఫలానా అని చెప్పటం సాధ్యం కాదు కానీ.. కొన్ని సెంటిమెంట్లు అదే పనిగా వెంటాడుతూ ఉంటాయి. తెలంగాణరాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తల్లో టీఆర్ఎస్ నేతల్ని తేనెటీగలు అదే పనిగా వెంటాడేవి. ఎక్కడికక్కడ వారి మీద విరుచుకుపడటం.. వారు పరుగులు తీయటం కనిపించేది. తర్వాత తర్వాత ఆ సీన్లు తగ్గిపోయాయి.
అదే సమయంలో మరో కొత్త ఇబ్బంది వారిని వెంటాడుతోంది. కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు లిఫ్ట్ గండంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. కొద్ది నెలల క్రితం మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై.. తిరిగి వస్తుండగా లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్ తీగ తెగిపోయింది.
దీంతో.. ఆయన కాళ్లకు ఫ్యాక్చర్ కావటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరీ.. ఇంత కాకున్నా.. ఈ మధ్యన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు లిఫ్ట్ లో ఇర్కుపోయిన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. తాజాగా లిఫ్ట్ గండంలో చిక్కుకున్నారు మంత్రి గంగుల కమలాకర్. కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని లిఫ్ట్ లో ఎక్కిన ఆయన సాంకేతిక లోపంతో లిఫ్ట్ లో ఉండిపోయారు.
దాదాపుగా అరగంట పాటు ఆయన లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగులగొట్టి మంత్రిని బయటకు తీశారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి మంత్రి తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. మరోవైపు.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు లిఫ్ట్ గండం వెంటాడుతోందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.