బెజవాడ గ్యాంగ్ వార్...షాకింగ్ నిజాలు

August 13, 2020

విజయవాడలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు కత్తులు, రాళ్లతో, కర్రలతో ఘర్షణ పడ్డ ఘటన ఏపీలో పెను దుమారం రేపింది. ఈ స్ట్రీట్ ఫైట్ లో సందీప్ అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాంగ్‌‌వార్‌‌లో ప్రాణాలు కోల్పోయిన సందీప్ మృతదేహం తరలింపులో తర్జనభర్జనలు ఏర్పడ్డాయి.

మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్తామని పోలీసులను కుటుంబ సభ్యులు కోరారు. తల్లి ఇంటి వద్ద నుంచి కదలలేని పరిస్థితిలో ఉండటంతో కడసారిచూపు కోసం ఇంటికి అనుమతించాల్సిందిగా పోలీసులను కోరారు. అయితే పోలీసులు మాత్రం మృతదేహాన్ని నేరుగా స్వర్గపురికే తీసుకెళ్లాలని ఆదేశించారు.
 
విద్యార్థుల గ్యాంగ్ వార్‌కు యనమలకుదురులోని రూ. 2 కోట్ల విలువైన భూమి కారణమని తెలుస్తోంది. ల్యాండ్ డీల్‌కు సంబంధించి రెండు గ్రూపులు జోక్యం చేసుకోవడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు గ్రూపులకు చెందిన 30 మందికి పైగా కాలేజీ విద్యార్థులు విజయవాడలోని పడమటలోని ఒక ఖాళీ గ్రౌండ్ లో కత్తులు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సందీప్ మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో రాజకీయ పార్టీ నేతల అనుచరులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మాజీ రౌడీషీటర్ తో పాటు రాజకీయ నేతల కనుసన్నల్లోనే ఈ స్ట్రీట్ ఫైట్ జరిగిందని తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న బెజవాడలో గ్యాంగ్ వార్ జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రశాంతంగా ఉన్న బెజవాడలో....గతంలో మాదిరి గొడవలు జరుగుతుండడంతో భయంభయంగా గడుపుతున్నారు.