గంటా కమ్స్ అండ్ గోస్... అదో నిరంతర ప్రక్రియ

August 15, 2020

ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు.... గాల్లో పిట్టను చూసి వంటకు మసాలా నూరినట్టు ఉంది గంటా పరిస్థితి. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే... దానికి జై కొట్టలేక పోతున్నానని అనుచరులతో చెబుతున్నారట గంటా వారు. అందుకే టీడీపీని వీడితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. అయినా పార్టీలు మారడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జగన్ చెప్పినట్టు అదో నిరంతర ప్రక్రియ గంటావారికి !

వాస్తవం ఏంటంటే... వ్యాపారాలు ఉన్న రాజకీయ నాయకులు పార్టీ మారడం అన్నది చాలా సర్వసాధారణం. అందుకే ఏ పార్టీ అయినా వ్యాపారాలు ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే వ్యాపారి తన వ్యాపారాలు క్షేమంగా ఉండాలనుకుంటాడు. రాజకీయ నాయకుడు తన పార్టీ క్షేమంగా ఉండాలనుకుంటారు. కాబట్టి పార్టీ అధినేతలు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండకపోతే వారు అధికారం ఉన్నపుడు వాడుకుని ఇలా వదిలేస్తుంటారు.

అయితే, ఇప్పటికే అనేక పార్టీలు మారిన అనుభవం వల్ల, తాను పరువు పోగొట్టుకోకుండా పార్టీ మారడం కోసం గంటా వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి అనుకుంటున్నారట. ఆ పనిచేస్తే బెటర్. ఎందుకంటే వైజాగ్ ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకు కూడా అర్థమవుతుంది కదా తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో. 

గంటా వస్తే పార్టీలో తన ఆటలు చెల్లవని అవంతి శ్రీనివాస్ అడ్డుకట్ట వేస్తున్నారన్న రాజకీయ పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు గంటాను పోతే పోవయ్యా నీ కంటే ముందు తెలుగుదేశం ఉంది... నీ తర్వాత కూడా తెలుగుదేశం ఉంటుంది అంటూ పూచికపుల్లలా గంటాను తీసేయడం మొదలుపెట్టారు. 

ఆగస్టు 15 ఇళ్ల స్థలాల ముహూర్తం రోజునే గంటా వారి ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. ఆ వేదికపైనే పార్టీ మార్పు ఉంటుందట. ఇంకో వదంతి ఏంటంటే...  వైసీపీలో సాయిరెడ్డి, అవంతిల కూటమికి కాస్త చెక్ పెట్టడానికే జగన్  గంటా శ్రీనివాసరావును తెరపైకి తెస్తున్నారన్న వాదన కూడా ఉంది.

ముఖ్యమైన విషయం... ఈ సమాచారం ఏదీ అధికారికం కాదు... సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం అని నమస్తేఆంధ్ర పాఠకులు గుర్తుంచుకోవాలి.