సీఎం ఎవరైనా... కింగ్ మాత్రం గంటా యేనా !!

April 03, 2020

విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇప్పటికీ కీలక నేతగానే ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నట్లు ఆ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరికొందరు నేతలూ వైసీపీలోకి వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది. ఈ ప్రచారం చాలాకాలంగా జరుగుతుండగా.. గంటా వర్గం దాన్ని ఖండిస్తూ కూడా వస్తున్నారు. అయితే... ఇప్పుడు వైసీపీతో కోరుకున్న ఒప్పందం జరిగిందని.. గంటా పార్టీ మార్పు ఖాయమని తెలుస్తోంది. జగన్ పెట్టిన నియమం ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాజీనామా చేసి రావాలి.. అసలే ఎదురుగాలిలో గెలవడం గొప్ప అనుకుంటున్న పరిస్థితుల్లో ఎవరూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావడానికి ఇష్టపడడం లేదు. గంటా వైసీపీలో చేరడం ఆలస్యం కావడానికీ అదే కారణం.. అయితే.. ఇప్పుడు గంటా ప్రతిపాదనకు వైసీపీలో ఆమోదం దొరకడంతో ఆయన వైసీపీలోకి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది ఆయన ప్రతిపాదనగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డిక సన్నిహితులైన కొందరు పారిశ్రామికవేత్తలు జగన్ వద్ద గంటా కోసం రాయబారం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు జగన్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
జగన్ గంటా వైపు మొగ్గు చూపడానికి కారణాలున్నాయంటున్నాయి వైసీపీవర్గాలు. విశాఖలో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌తో ఆ జిల్లాకు చెందిన మిగతా నాయకులు ఎవరికీ పొసగకపోవడం.. ఇటీవల బోటు ప్రమాదం విషయంలోనూ అవంతిపై ఆరోపణలు రావడం.. వరద ఉందని అధికారులు బోటుకు అనుమతి ఇవ్వకపోతే అవంతి మనుషుల నుంచి ఫోన్లు వెళ్లడంతోనే అనుమతిచ్చారన్నది ఆ ఆరోపణ.. వంటి కారణాలతో ఆయన్ను తప్పించి ఆ స్థానంలో గంటాకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట.
గంటా టీడీపీలో ఉన్నా, ప్రజారాజ్యంలో ఉన్నా.. ఎక్కడున్నా కూడా ఆయన రాజకీయాలు ఆయన చేస్తూ కీలకంగా వ్యవహరించడం.. ప్రత్యర్థులను జాగ్రత్తగా టేకిల్ చేయడం.. పార్టీ పెద్ద తలకాయలతో విభేధించకపోవడం వంటి నేపథ్యం ఉండడంతో ఆయన వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణలు మంత్రులుగా ఉండగా.. వారిలో కృష్ణదాస్ మెతగ్గా ఉన్నారని.. బొత్స తన  నోటి తీరు కారణంగా పార్టీకి ఇబ్బందులు తెస్తున్నారని జగన్ భావిస్తున్నారట. కాబట్టి అనుభవం ఉన్న గంటాను తెస్తే అటు బొత్స దూకుడుకు బ్రేక్ పడుతుంది.. ఆ ప్రాంతంపై వైసీపీ పట్టూ పెరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.