మ‌హేష్ అన్నారు.. ప్ర‌భాస్ అన్నారు.. చివ‌రికి చూస్తే

July 14, 2020

గ‌త ఏడాది ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నాడు దర్శకుడు పరశురామ్. అప్పటిదాకా మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వచ్చిన అతను.. ఈ సినిమాతో తన స్థాయి ఎంతో పెంచుకున్నాడు. ఆ సినిమా సాధించిన విజ‌యం చూసి పెద్ద హీరోలు అతడితో పని చేయడానికి రెడీ అయిన‌ట్లుగా వార్ల‌లొచ్చాయి. మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. ఇలా ప‌ర‌శురామ్ త‌ర్వాతి సినిమా హీరోగా ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. కానీ చివ‌రికి చూస్తే వీళ్లెవ్వ‌రూ ఈ ద‌ర్శ‌కుడికి క‌మిట్మెంట్ ఇవ్వ‌లేదు. వాళ్ల‌ను ప‌ర‌శురామ్ క‌లిశాడా.. క‌థ‌లు వినిపించాడా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. కానీ ఇందులో ఏ పెద్ద స్టార్‌తోనూ ప‌ర‌శురామ్ త‌న త‌ర్వాతి సినిమా చేయ‌ట్లేదు.
ఎప్ప‌ట్లాగే మీడియం రేంజిలోనే ప‌ర‌శురామ్ త‌న త‌ర్వాతి సినిమా చేయ‌నున్నాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల తాజా స‌మాచారం. అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య‌తో ప‌ర‌శురామ్ సినిమా క‌మిట‌య్యాడ‌ట‌. ఈ కాంబినేష‌న్లో సినిమాకు నిర్మాతలు కూడా ఖ‌రార‌య్యారు. 14 రీల్స్ నుంచి విడిపోయి 14 రీల్స్ ప్ల‌స్ బేన‌ర్లో తొలిసారిగా వాల్మీకి (గ‌ద్ద‌ల కొండ‌ గ‌ణేష్‌) సినిమాను నిర్మించి మంచి ఫ‌లితాన్నందుకున్న రామ్ ఆచంట‌, గోపీనాథ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని.. కొత్త ఏడాదిలో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంద‌ని స‌మాచారం. ప‌ర‌శురామ్-చైతూల శైలి ప్ర‌కారం చూస్తే.. ఇద్ద‌రూ త‌మ‌కు న‌ప్పే ప్రేమ‌క‌థ‌నే ప్ర‌య‌త్నించే అవ‌కావ‌ముంది. త్వ‌ర‌లోనే వెంకీ మామ‌తో ప‌ల‌క‌రించ‌నున్న చైతూ.. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాను పూర్తి చేశాక ప‌ర‌శురామ్ సినిమా మీదికెళ్లే అవ‌కాశ‌ముంది.