జార్జి రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ తీస్తే..

July 12, 2020

జార్జి రెడ్డి.. డ‌ల్లుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మ‌ళ్లీ కాస్త ఊపు తెస్తుంద‌ని భావిస్తున్న సినిమా. కేవ‌లం ఒక ట్రైల‌ర్‌తో ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ ట్రైల‌రే సినిమాకు బిజినెస్ కూడా చేసి పెట్టింది. ఈ నెల 22న జార్జి రెడ్డి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి-2, అర్జున్ రెడ్డి త‌ర‌హాలో ఈ సినిమాకు ముందు రోజు పెయిడ్ ప్రిమియ‌ర్లు కూడా వేస్తుండ‌టం విశేషం.
ఈ సినిమా గురించి టాలీవుడ్ ప్ర‌ముఖులు స్వ‌చ్ఛందంగా స్పందిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌నను ఈ సినిమా ఎలా ఆక‌ర్షించిందో.. ట్రైల‌ర్ చూసి ఎలా ఎగ్జైట్ అయ్యానో వివ‌రించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టిని సైతం ఈ సినిమా ఆక‌ర్షించిన‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడు అర్జున్ రెడ్డితో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ సైతం జార్జి రెడ్డి గురించి మాట్లాడాడు.
ఈ ట్రైల‌ర్‌ను షేర్ చేస్తూ.. జార్జి రెడ్డి విప్ల‌వాత్మ‌క రీస‌ర్చ్ స్కాల‌ర్ అని, గొప్ప నాయ‌కుడ‌ని.. తాను జార్జి రెడ్డి సినిమా తీయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నాన‌ని వెల్ల‌డించాడు సందీప్ రెడ్డి. త‌న ప్ర‌యారిటీ లిస్టులో ఆ క‌థ ఎప్ప‌ట్నుంచో ఉంద‌ని సందీప్ చెప్పాడు. ఈ సినిమా తీసిన జీవ‌న్ రెడ్డి అండ్ టీంను సందీప్ అభినందించాడు. జార్జి రెడ్డి ట్రైల‌ర్ చూసిన చాలామందికి హీరో పాత్ర‌లోని ఇంటెన్సిటీ, టేకింగ్ అర్జున్ రెడ్డిని గుర్తుకు తేవ‌డం విశేషం. అర్జున్ రెడ్డి త‌ర‌హాలోనే ఇది కూడా సెన్సేష‌న‌ల్ హిట్ట‌వుతుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. నిజంగా సందీపే ఈ సినిమా తీస్తే అది ఒక రేంజిలో ఉండేదేమో.