తప్పు పాతది, శిక్ష కొత్తది !!

August 14, 2020

జర్మన్ : పాశ్చాత్య దేశాలు తమ పౌరులు అయినా సరే నిబంధనల విషయంలో ఎంత కఠినంగా ఉంటాయో అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటన. ఎడ్గార్ట్ జీబాట్ అనే యువకుడు జర్మనీ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్తూ... మధ్య ఫ్లైట్లు ఆగిపోవడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయాడు. 

జర్మనీ ప్రపంచ వ్యాప్తంగా ఇరుక్కున్న జర్మన్లందరినీ వెనక్కు తీసుకెళ్లింది. కానీ జీబాట్ ని మాత్రమే వదిలేసింది. అతనొక్కడే చేసిన పాపమేంటి? అతన్ని ఎందుకు వదిలేసింది? అంటే ఆసక్తికరమైన విషయం తెలిసింది.

జర్మనీ నిబంధనల ప్రకారం... క్రైమ్ రికార్డు ఉన్న వారికి ప్రత్యేక సదుపాయాలు, సహాయాలు ప్రభుత్వం నుంచి అందవు. అందుకే అతడిని జర్మనీ పట్టించుకోలేదు. అతను టర్కీకి వెళ్లాల్సి ఉంది. టర్కీ ఎంబసీ వారిని అడిగినా వారు కూడా తీసుకెళ్లలేదు. 

ఇండియాలో నివసించడానికి భారత ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. మీ సొంత దేశమే నిన్ను నమ్మనపుడు ఇండియా నీకు వీసా ఇవ్వడం కుదరదు అని అధికారులు అతనికి తేల్చి చెప్పింది.

ఇక చేసేదేమీ లేక అతను ఎయిర్ పోర్టులోని ట్రాన్సిట్ ఏరియాలో ఒకడే నివసిస్తున్నాడు. మన దేశం పెద్దమనసుతో అతనికి పడుకోవడానికి ఒక రిక్లైనర్, దోమ తెర, నిత్యావసర వస్తువులు ఇస్తోంది. 

ఎయిర్ పోర్ట్ లో ఇప్పటికీ వివిధ దేశాలు తమ వారిని తీసుకెళ్లడానికి నడుపుతున్న ప్రత్యేక విమానాల వల్ల సిబ్బంది, అధికారులు అక్కడ ఉన్నారు. ఎయిర్ పోర్ట్ పనిచేస్తోంది. కొన్ని క్యాంటీన్లు కూడా తెరచి ఉన్నాయి. అతను వాటిలో తింటూ జీవనం సాగిస్తున్నాడు.

ఖాళీ సమయాల్లో పత్రికలు, పేపర్లు చదువుతున్నాడు. కుటుంబసభ్యులతోనో, స్నేహితులతోనో మాట్లాడుతున్నాడు. 

ఇన్ని విమానాలు నడుస్తున్నాయి. నాకు చాలా దేశాల వీసాలున్నాయి. ఏదో ఒక దేశానికి పంపండి డబ్బులు నేను భరిస్తాను అని అతను వేడుకున్నా భారత్ ఒప్పుకోలేదు. కాకపోతే ట్రాన్సిట్ ఏరియాలో నివసించడానికి వైద్యంతో సహా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది.

సరిగ్గా ఇలాంటి స్టోరీతోనే టామ్ హాంక్స్ సినిమా ‘‘ది టెర్మినల్‘‘ తీశారు. అందులో హీరో ఒక గుర్తింపు లేని దేశం నుంచి రావడంతో అమెరికాలోకి అనుమతించరు. దీంతో అతను ఎయిర్ పోర్ట్ లోనే జీవితం గడిపేస్తాడు. ఆ సినిమా ఢిల్లీలో నిజమైంది.