మహా శిఖరం కూలిపోయింది

September 17, 2019

ప్ర‌ముఖ సినీ.. రంగ‌స్థ‌ల న‌టుడు క‌మ్ ద‌ర్శ‌కుడు.. ర‌చ‌యిత గిరీశ్ క‌ర్నాడ్ (81) ఈ రోజు క‌న్నుమూశారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా హంగుల్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. సినిమాకు శోభ తెచ్చేలా.. థియేట‌ర్ ఆర్ట్ ఫాం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. మాస్ ఇమేజ్ లేకున్నా.. క‌ళామ‌త‌ల్లి ముద్ద‌బిడ్డ‌గా కీర్తిప్ర‌తిష్ఠ‌లున్న గిరీశ్ క‌ర్నాడ్ మ‌రణం దేశ సినీ ప‌రిశ్ర‌మ‌కు భారీ లోగుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
బెంగ‌ళూరులోని ఆయ‌న స్వ‌గృహంలో ఆయ‌న ఈ రోజు (సోమ‌వారం) ఉద‌యం 6.30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్లుగా చెబుతున్నారు. 1938 మే 19న మ‌హారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జ‌న్మించిన ఆయ‌న‌.. క‌న్న‌డ‌లో ప‌లు నాట‌కాలు ర‌చించి.. వాటిని వెలుగులోకి తెచ్చారు.
సంస్కారా చిత్రంతో వెండితెరకు ప‌రిచ‌యమైన ఆయ‌న త‌ర్వాతి కాలంలో ప‌లు క‌న్న‌డ‌.. హిందీ.. త‌మిళం.. మ‌ల‌యాళం.. తెలుగు సినిమాల్లో న‌టించారు.
వెంక‌టేశ్ హీరోగా న‌టించిన ధ‌ర్మ‌చ‌క్రంతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఆయ‌న‌.. త‌ర్వాతి కాలంలో శంక‌ర్ దాదా- ఎంబీబీఎస్.. కొమ‌రం పులి.. స్కెచ్ ఫ‌ర్ ల‌వ్ అనే సినిమాల్లో న‌టించారు. బుల్లితెర మీద త‌న ముద్ర‌ను వేసిన ఆయ‌న‌.. మాల్గుడి డేస్ అనే సీరియ‌ల్ లో పాపుల‌ర్. ఒక పార్టీలో క‌లిసిన డాక్ట‌ర్ స‌ర‌స్వ‌తి గ‌ణ‌ప‌తిని పెళ్లాడిన ఆయ‌న‌కు ఇద్ద‌రు సంతానం.
సాహిత్యంలో మంచి ప‌ట్టు ఉన్న ఆయ‌న‌కు 1998లో సాహిత్య అకాడ‌మీ వారు జ్ఞానపీఠ్ అవార్డును ప్రధానం చేశారు. సాహిత్య రంగానికి ఆయ‌న చేసిన సేవ‌కు గుర్తింపుగా 1974లో ప‌ద్మ‌శ్రీ‌.. 1992లో ప‌ద్మ భూష‌న్ పుర‌స్కారాలు ల‌భించాయి. ఇక‌.. సినిమా రంగంలో ఆయ‌న‌కు వ‌చ్చిన ఆవార్డుల‌కు కొద‌వ లేదు. ఏడు ఫిలింపేర్ అవార్డులు.. 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. సినీ రంగంలో మేరున‌గం లాంటి ఆయ‌న మ‌ర‌ణం తీర్చ‌లేనిది. ఆయ‌న మ‌ర‌ణంపై ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.