గోవా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ 

August 02, 2020

వయసు ఏదైనా కానీ.. అమ్మాయి.. అబ్బాయి ఎవరైనా కావొచ్చు.. ఒకలాంటి ఎంజాయ్ మెంట్ కు పర్ ఫెక్ట్ డెస్టినేషన్ గా గోవాగా చెబుతారు. అక్కడి కాసినోలు కానీ.. మద్యం కానీ.. ఇతరత్రా ఎంజాయ్ మెంట్లతో మస్తు ఖుషీ చేసుకోవచ్చన్న మాట పలువురు నోట వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటివాటి కోసం కాకుండా కేవలం అక్కడి సముద్ర అందాల్ని.. బీచ్ లో సేద తీరాలనుకునే వారు సైతం.. గోవా నుంచి వచ్చేటప్పుడు తమకు తెలిసినవారికో.. సన్నిహితులకో బహుమతిగా మద్యం సీసాల్ని తీసుకురావటం మామూలే.
మరే రాష్ట్రంలో లేని రీతిలో గోవాలో మద్యం మీద పన్నులు తక్కువగా ఉండటంతో.. ఈ రాష్ట్రానికి టూరిస్టులుగా వెళ్లి వారంతా మద్యం సీసాల్ని కచ్ఛితంగా కొనుగోలు చేస్తారు. మామూలుగా మద్యానికి ఆమడ దూరంలో ఉన్నోళ్లు సైతం.. లిక్కర్ బాటిల్ ను కొని.. బహుమతిగా ఇచ్చేలా చేస్తుంది గోవా.
అలాంటి గోవా రాష్ట్రానికి వెళ్లే వారికి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికున్న లిక్కర్ రేట్లకు అదనంగా 20 శాతం నుంచి 50 శాతం వరకూ పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పటమే కాదు.. ఈ కొత్త పన్ను విధానం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లుగా గోవా రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఇలా పెంచిన పన్ను రేట్లతో గోవా ప్రభుత్వానికి రూ.100 కోట్ల మేర అదనపు ఆదాయం లభించే వీలుందని అంచనా వేస్తున్నారు. గోవా సర్కారుకు వచ్చే ఆదాయం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటివరకూ ఆ రాష్ట్రానికి వెళ్లే టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండే కీలకమైనది మిస్ కావటం ఖాయం.