కృష్ణంరాజు స్థానాన్ని భర్తీ చేయబోయేది ఈయనేనా..?

December 14, 2019

ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్‌సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీని వీడి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీని తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీలో అవమానాలను ఎదుర్కొంటున్నా. నరసాపురం టికెట్‌ విషయం తేల్చకుండా సాగదీయడం నచ్చలేదు. వైసీపీలో చేరడం తిరిగి సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉంది. వైఎస్‌ జగన్‌ కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. గతంలో కొన్ని మనస్పర్థల కారణంగా పార్టీ మారానని, ఇప్పుడు ఆ మనస్పర్థలు సమసిపోవడంతో తిరిగి పార్టీలో చేరా. వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తా. నా ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించే భాద్యత నాదే. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి. విభజన హామీలు అమలుకావాలంటే జగన్‌ వల్లే సాధ్యమని ప్రజలు అంటున్నారు. విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌కే ఉంది. తటస్తులు కూడా జగన్‌ సీఎం కావాలంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈయన వెళ్లిపోవడంతో నరసాపురం టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

 

 రఘురామ కృష్ణంరాజు స్థానాన్ని భర్తీ చేయబోయేది ఎవరనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంత స్పష్టతతో ఉన్నారని తెలిసింది. ఇక్కడి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వీరిద్దరూ ఆర్థికంగా వెనకబడిపోయారనే టాక్ వినిపిస్తోంది. అందుకే వీళ్లిద్దరూ కాకుండా ఆర్థిక, సామాజిక పరంగా బలమైన మరో నేత ఎవరైనా చూడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో నరసాపురం సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజు(పెద బుజ్జి) పేరు తెరపైకి వచ్చింది. గతంలో వీళ్లను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అప్పుడు రఘురామ కృష్ణంరాజు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చెప్పుకోవడంతో ఆయనకు బలమైన ప్రత్యర్థిని దించాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీ ఈ ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు గోకరాజు రంగరాజును టీడీపీ తరపున దింపాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. ఈ తరుణంలో టికెట్ ఎవరికి కన్ఫార్మ్ అవుతుందో చూడాలి.