చేతిలో డబ్బులు ఉన్నాయా? బంగారం కొనేస్తే బెటరా? 

August 08, 2020

ఊహించని రీతిలో ప్రపంచం మీద మాయదారి రోగం తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ.. అన్ని రకాల వ్యాపారాలు దెబ్బ తిన్న పరిస్థితి. కొన్నింటికి మాత్రమే మినహాయింపుగా చెప్పాలి. ఇదే కాదు.. కాసులు కురిపించే రియల్ ఎస్టేట్ సైతం నెమ్మదించటమే కాదు.. పాత రోజులు రావాలంటే మరికొంత కాలం పడుతుందని చెప్పక తప్పదు. ఇలంటివేళ.. దేని మీద పెట్టుబడులు పెట్టాలి? అన్నది ప్రశ్నగా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారన్ని మదుపు చేయటానికి మించిన మంచి అవకాశం లేదంటున్నారు. లిక్విడ్ చేసుకోవాలనుకున్నంతనే చేసుకునే అవకాశం ఉండటంతో పాటు.. రానున్న కొద్ది నెలల్లో ధర భారీగా పెరగటం ఖాయమంటున్నారు. ముడి చమురుతో పాటు.. అన్నింటి విషయంలోనూ వెనకడుగు పడుతున్న వేళ.. అందరి ఫోకస్ బంగారం మీదనే పడింది ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారు ర్యాలీ ఓ రేంజ్లో సాగుతోంది.
ఇప్పుడున్న ధర సరే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండనుంది? అన్న ప్రశ్నకు ఈ రంగంలోని నిపుణులు చెబుుతున్న మాటల్ని వినాల్సిందే. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారానికి డిమాండ్ భారీగా పెరగనుందన్న వాదనను వినిపిస్తున్నారు. రానున్న ఒకట్రెండు నెలల్లోనే పది గ్రాముల బంగారం రూ.51వేల మార్కును దాటేయటం ఖాయమంటున్నారు.
ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వ్యవధిలో బంగారం ధర దేశీయంగా పది గ్రాములు రూ.65 వేల నుంచి రూ.68 వేల వరకే చేరుకునే అవకాశం ఉందంటున్నారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా పాత రోజులు వచ్చేందుకు చాలా కాలమే పట్టే అవకాశం ఉందంటున్నారు.
తాత్కాలిక హెచ్చుతగ్గుల విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీర్ఘ కాలంలోనూ బంగారాన్ని మదుపు చేయటానికి మించింది మరొకటి లేదన్న మాటను చెబుతున్నారు. ఏడాదిన్నర ఆగితే.. ఊహించని రీతిలో రిటర్న్స్ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఈ విశ్లేషణలో వాస్తవం ఎంతన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.