గూగులే అలా చేసిందంటే... ఏమిటి దానర్థం?

August 10, 2020

గూగుల్ ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటి. ఉద్యోగుల విషయంలో, వారికి సదుపాయాలు కల్పించడంలోను దాని ప్రత్యేకతే వేరు. గత వందేళ్లలో చూడని కష్టంతో ప్రపంచం వణుకుతున్న నేపథ్యంలో ఉద్యోగుల పనితీరు, విధానమే మారిపోయింది. ఎపుడో మరో పదేళ్లకు జరగాల్సిన శాటిలైట్ వర్కింగ్ ఇపుడే మొదలైపోయింది. గూగుల్ తో పాటు అన్ని ఐటీ దిగ్గజాలు వర్క్ ఫ్రమ్ ఇచ్చేస్తున్న నేపథ్యంలో తొలి విడదత దానిని జులై 31 వరకు పొడిగించింది కేంద్రం. తర్వాత ఆ గడువును డిసెంబరు 31 చేసింది. అయితే, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఒక విద్యా సంవత్సరం మొత్తం కవరయ్యేలాగా డిసెంబరు 31 కాదు, వచ్చే ఏడాది 2021 జూన్ వరకు వర్క్ ఫ్రం హోమే అంటే అధికారికంగా ఉద్యోగులకు చెప్పేసింది. దీంతో ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అంతా ఇక తమ ఇళ్లను ఖాళీ చేసే రోజులు వచ్చాయి. ఒక ఏడాది పిల్లలను ఊర్లోనే చదివించుకునే అవకాశం. రెండు పంటలు పండించి తర్వాత ఎంచక్కా వచ్చేయొచ్చు. ఇదొక వింత కొత్త అనుభవం. ఇప్పటికే కుదేలైన హైదరాబాదు మునుపు ఇంకెలా ఉండబోతోందో మరి? 

ఇక గూగుల్ అలా చేస్తే... ఇతర కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తాయి. అందులో అనుమానం లేదు. పైగా దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గింది, ఉద్యోగుల ఫర్మాఫెన్స్ కూడా పెరిగింది. దీంతో అవకాశం ఉన్న కంపెనీలు దీని ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటాయి. వర్క్ ఫ్రంహోం అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీలకు ఇరువురికీ లాభదాయకంగానే ఉంది. ఇపుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి స్కూళ్లు ఏర్పాటైన నేపథ్యంలో చాలామంది తమ సొంతూళ్లలో తాత్కాలికంగా సెటిలైపోతున్నారు. మహానగరాలకు అందరూ తాత్కాలికంగా బై చెప్పేస్తున్నారు. గూగుల్ నిర్ణయంతో ఇదింకా పెరిగే అవకాశం లేకపోలేదు.