జగన్ ఇంగ్లిష్ అంటే... గూగుల్ తెలుగంటోంది

August 10, 2020

భారత ప్రధాని నరేంద్రమోడీతో వర్చువల్ సమావేశం అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Chief Executive Officer of Alphabet) సంచలన ప్రకటన చేశారు. భారతదేశంలో గూగుల్ 10 బిలియన్ డాలర్లు (75 వేల కోట్లు) పెట్టుబడులు పెడుతుందని ప్రకటించారు. ఈ నిధులను నాలుగు భాగాలుగా విభజించి ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్, పార్ట్‌నర్‌షిప్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఎకోసిస్టమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూపంలో ఇండియాకు మళ్లిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అందుకే దీనిని డిజిటైజేషన్ ఫండ్ గా పేర్కొన్నారు.

దీని గురించి ఆయన వేసిన ట్వీట్ యతాథతంగా..

Today at GoogleForIndia we announced a new $10B digitization fund to help accelerate India’s digital economy. We’re proud to support PM Narendra Modi’s vision for Digital India - many thanks to Minister @rsprasad & Minister @DrRPNishank for joining us.

ఈ డిజిటైజేషన్ ఫండ్ కి నాలుగు లక్ష్యాలను పెట్టుకున్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరు మాతృభాషలో సమాచారాన్ని పొందగలగడం (1), భారతదేశానికి  అవసరమైన కొత్త సేవలు, ఉత్పత్తులు, వస్తువులను ప్రారంభించడం(2), డిజిటల్ చెల్లింపుల దిశగా చిన్న, పెద్ద వ్యాపారులను ప్రోత్సహించడం (3), ఆధునాతన టెక్నాలజీతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపైనే తాము దృష్టిసారిస్తామని పిచాయ్ వివరించారు.

మరింత వివరంగా ఈ లింకులో చదువుకోవచ్చు - https://blog.google/inside-google/company-announcements/investing-in-indias-digital-future

భారతదేశంలో చిన్న చిన్న వ్యాపారాలు కూడా డిజిటలైజేషన్ వైపు మళ్లడం అద్భుతంగా సాగుతోందన్నారు. 2.6 కోట్ల చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను గూగుల్ సెర్చ్, మ్యాప్ లపై చూడొచ్చాన్నారు. వాటికి నెలకు 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు వివరించారు. చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 

దేశ వ్యాప్తంగా ఉన్న 22 వేల పాఠశాలల్లో పదిలక్షల మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది చివరిలోగా శిక్షణ ఇవ్వటానికి సీబీఎస్ఈతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న కీలక విషయాన్ని ఆయన వెల్లడించారు. అల్పాదాయ వర్గాలకు పది లక్షల డాలర్లు  గూగుల్.ఓఆర్జీ గ్రాంట్ ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

మోడీతో పిచాయ్ జరిపిన చర్చల్లో  కరోనావైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక, సామాజిక సమస్యలు, డీప్ ఎకనమిక్ రెసిషన్, పెట్టుబడులు, కోవిడ్ అనంతరం పరిస్థితులు, టెక్నాలజీ లాంటి విషయాలు చర్చకు వచ్చాయి.

అంతర్జాతీయ సంస్థలు మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ తమ సేవలను మాతృభాషలో అందించడానికే ప్రయత్నం చేస్తుంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తెలుగు ఎందుకు పనికొస్తుంది. ఇంగ్లిష్ మాత్రమే మనకు బువ్వ పెట్టేదని అంటున్నారు. మాతృభాష అనేది కేవలం భాష కాదు, సంస్కృతి. తాజాగా గూగుల్ కూడా తన నాలుగు లక్ష్యాల్లో మాతృభాషల్లో టెక్నాలజీ అభివృద్ధి అనేక కీలక నిర్ణయం ప్రకటించిన విషయం గమనించాలి.

కింద వీడియో రూపంలో గూగుల్ ఇండియాలో పెట్టబడుల లక్ష్యాలను వివరించింది.