గూగుల్ గుర్తు చేస్తోంది

July 08, 2020

దేశ వ్యాప్తంగా తొలి విడుత ఎన్నికలు గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల దాకా జరగనుంది. నక్సల్‌ ప్రభావ ప్రాంతంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్లు పోలింగ్‌కు విశేష స్పందన వస్తోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో మాత్రం చెదురుమొదురు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి అన్ని చోట్ల సందడి వాతావరణం నెలకొంది.

ఇదిలాఉండగా, ఓటు హక్కు పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ముందుకొచ్చింది. తొలి విడుత పోలింగ్ సందర్భంగా ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించే విధంగా తయారు చేసిన ఈ డూడుల్‌ ఆకట్టుకుంటోంది. గూగుల్‌లోని రెండో ‘ఓ’ స్థానంలో సిరా గుర్తు వేసిన వేలు ఆకారాన్ని ఉంచింది. అంతేకాదు, పోలింగ్ కోసం అభ్యర్థుల పేర్లు, ఓటర్ల జాబితా, ఓటరు కార్డు లేకపోతే ఏ, ఏ కార్డులతో ఓటేయొచ్చో కూడా తెలియజేశారు. పోలింగ్ బూతులు ఎక్కడున్నాయో కూడా గుర్తించేలా సమాచారాన్ని పొందుపరిచారు. ఇలా పలు అంశాలను డూడుల్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.