షాకింగ్: ఈవీఎం, పేపర్ లీక్... రెండూ ద్వివేది ఆధ్వర్యంలోనే !

February 22, 2020

ఏపీలో గ్రామ సచివాలయ పరీక్షలలో అవకతవకలు జరుగుతున్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు ప్రకటించినప్పటికీ కట్ ఆఫ్ మార్కులు వెల్లడించకుండానే సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభిస్తుండడంతో అనుమానాలు మొదలవుతున్నాయి. భారీ రిక్రూట్‌మెంట్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ నియామకాలకు సంబంధించిన వెబ్‌సైట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు కానీ, కటాఫ్ మార్కులు కానీ ప్రకటించకపోవడంతో పూర్తిగా వైసీపీకి చెందినవారికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ కూడా దీనిపై ట్వీట్లు చేసినా అందులోనూ ఎక్కడా అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం చేయలేదు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల ప్రధాన అధికారి ఉండగానే జరిగాయి. ఈ పరీక్షల మాదిరిగానే ఎన్నికల్లోనూ పారదర్శకత లోపించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. ఆశ్రిత పక్షపాతంతో వైసీపీ కార్యకర్తలకు, వారి కుటుంబీకులకు మాత్రమే ఉద్యోగాలిచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకల కారణంగా ఏపీపీఎస్సీ ప్రతిష్ఠపైనా మచ్చ పడిందన్నారు. వైసీపీకి చెందినవారి బంధువులు, స్నేహితులకే ఎక్కువ మార్కులు వచ్చాయని.. పరీక్ష పేపర్లు లీకయ్యాయనడానికి ఇదే ఉదాహరణని ఆయన ఆరోపించారు. ఇందులో ఏపీపీసీఎస్సీ, పంచాయతీ రాజ్ శాఖ, విద్యా శాఖ అందరూ బాధ్యులేనన్నారు. ఈ పరీక్షలను వెంటనే రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఈ అవకతవకల్లో ఆయనకూ భాగస్వామ్యం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులు, పరీక్షార్థుల నుంచీ ఇదే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇది చర్చనీయంగా మారింది. ఆయన ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడూ వైసీపీ కోసం పనిచేశారే తప్ప పారదర్శకంగా పనిచేయలేదని.. ఇప్పుడూ అదే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.