పోలీసులు-కార్యకర్తల మధ్య నలిగిపోతున్న వైసీపీ ఎంపీ

August 13, 2020

వైసీపీ ఎంపీకి విచిత్రమైన సమస్య ఎదురయ్యింది. తన బాధ అర్థం చేసుకోమని పోలీసులను బతిమాలుతున్నాడు. విచిత్రం ఏంటంటే... ఆయన కూడా ఒకప్పటి పోలీసే. ఈ సంఘటన జరిగింది హిందూపురంలో. ఆ ఎంపీ మాజీ సీఐ గోరంట్ల మాధవ్. ఇంతకీ ఏం జరిగిందంటే... లాక్ డౌన్లో ఎడాపెడా తిరిగిన జనాల బళ్లు పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందేగా.

దేశమంతా ఇదే జరిగింది. ఏపీలో కూడా అంతే. అయితే... మన రాజ్యంలో మనల్ని అడిగేదెవరు అని వైసీపీ కార్యకర్తలు తెగ తిరిగారు వారి నాయకుల్లాగే. పోలీసులకు బుక్కయిపోయి బళ్లు స్టేషన్లో లాకైపోయాయి. పాపం కొత్తకొత్త బళ్లు ఎండలో, దుమ్ముతో మాడుతున్నాయి.

ఇలాంటి వైసీపీ పిలకాయలంతా ఎంపీ వద్దకు వచ్చి సార్ ఇపుడైనా మా బళ్లు ఇప్పించండి అని మొరపెట్టుకుంటున్నారట. అయితే... ఆయన ఒక పోలీసేగా... వెంటనే అడగలేకపోయాడు. కొన్నాళ్లు సతమతమై  ఇక పోలీసుల వద్దకెళ్లి మన పిల్లోళ్ల బండ్లు ఇవ్వండి. ప్లీజ్ మీకు దండం పెడతాను అన్నారట. దండం పెట్టాల్సిన  అవసరం ఏంటి? అంటే... సర్కారు వాళ్లదే కదా. సర్కారు నిబంధనలు ప్రకారమే బళ్లను పట్టుకున్నారు. అందుకే గట్టిగా దబాయించలేక పాత బృందమే కాబట్టి బతిమాలుతున్నాడు.

అంత అవసరం ఆయనకేమి వచ్చిందా అనుకుంటున్నారా... మా ఎంపీ సారు వెంట తిరిగి ఓట్లేయిస్తా మా బండ్లు ఇప్పించలేకపోయారు పోలీసుల నుంచి అని ప్రాపగండా చేస్తున్నారట. దీంతో ఎంపీ తలపట్టుకుంటున్నాడు. పోలీసులేమో సార్ మీరు అడుగుతుంటే ఇవ్వాలని ఉంది... కానీ ఈ సమయంలో అంతా ఎస్పీ, కలెక్టర్ చేతుల్లో ఉన్నందున ఏం చేయలేకపోతున్నాం అని చేతులెత్తేశారట స్థానిక పోలీసులు. ఇక బళ్ల కోసం తన స్థాయి తగ్గించుకుని ఎస్పీకి, కలెక్టరుకు ఫోన్లు చేయలేక సతమతం అవుతారన్నారట వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.