శాసన సభ, మండలి ప్రొరోగ్: ఆ రెండు బిల్లుల ఆర్డినెన్స్‌కు జగన్‌కు ఛాన్స్

July 04, 2020

ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహాక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలుని నిర్ణయిస్తూ శాసన సభలో తీర్మానం చేశారు. సీఆర్డీఏ రద్దుపై కూడా సభలో తీర్మానానికి ఆమోదం లభించింది. ఐతే ఈ రెండు బిల్లులు మండలిలో నిలిచిపోయాయి. తాజాగా, శాసన సభ, మండలిలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పై రెండు బిల్లులకు మార్గం సుగమం అయినట్లుగా భావిస్తున్నారు.

ఉభయ సభల ప్రొరోగ్ నేపథ్యంలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. ఈ బిల్లులపై పట్టుదలతో ఉన్న జగన్ ప్రభుత్వం... ఆర్డినెన్స్ తీసుకు రావొచ్చునని చెబుతున్నారు. ఈ రెండు బిల్లులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే.

మండలిలో టీడీపీకి బలం ఉండటంతో నిలిచిపోయాయి. రెండు బిల్లులను చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించారు. సెలక్ట్ కమిటీకి వైసీపీ మినహా మిగతా పార్టీలు పేర్లు కూడా పంపించాయి. ఇదే సమయంలో సెలక్ట్ కమిటీల ఏర్పాటు కుదరదని మండలి కార్యదర్శి తిప్పి పంపించారు. దీనిపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రొరోగ్ చర్చనీయాంశంగా మారింది. ఇక వాటిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకు రావడం ఖాయమని అంటున్నారు.

ప్రొరోగ్ సర్వసాధారణ అంశం అయినా... జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం ఇది జరగడం చూస్తుంటే 3 రాజధానుల వ్యూహం వెనుక బీజేపీ గట్టిగా నిలబడుతోందని, జగన్ కు మద్దతు ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా తమ చేతికి మట్టి అంటకుండా బీజేపీ జగన్ కు సహకరించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Read Also

సాల్లేబ్బా నీ సంబడం... ఐవైఆర్
స్వామి సొమ్ము.. స్వాములోరికి!?
కేంద్రం చేతులెత్తేసినా జగన్ పదేపదే 'ప్రత్యేక' మంత్రం.. ఎందుకు?