వారిని చంపేయండి - నక్సల్స్ కు గవర్నర్ సంచలన సూచన

July 08, 2020

ఈ మాటలు అన్నది జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఏంటి గవర్నర్లు ఇలా కూడా మాట్లాడతారా? ఇదేదో అబద్ధంలా అనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. గవర్నర్ మాట్లాడింది అన్నిసార్లు వార్త కాదు కదా... ఇలా ఏదైనా సంచలనం అయితేనే కదా రాసేది. నిజంగానే రాజకీయ నాయకులను చంపమని గవర్నర్ పిలుపు ఇవ్వడం సంచలనమే. అంతేనా... విస్మయకరం కూడా. దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నా... అతను అన్నమాట యతాతథంగా వింటే మీరు సంతోషపడొచ్చు.
నక్సలైట్లు తరచుగా పోలీసులను చంపుతుంటారు. ఈ దేశంలో నక్సలిజం పుట్టింది దోపిడీకి వ్యతిరేకంగా. కానీ ఆ దోపిడీ చేసేవాళ్లను చంపకుండా పోలీసులు వారి టార్గెట్ అవుతున్నారు. దీనిపై మనస్ఫూర్తిగా స్పందించారు ఈ గవర్నర్. ప్రజల కోసం బతికే పోలీసులను చంపొద్దని, అవినీతికి పాల్పడే రాజకీయ నేతలు, అధికారులను చంపమని ఉగ్రవాదులకు, నక్సలైట్లకు పిలుపునిచ్చారు గవర్నర్.
కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘టెర్రరిస్టులు పోలీసులను చంపుతున్నారు. భద్రతా బలగాలను చంపుతున్నారు. ఎస్‌పీఓలను చంపుతున్నారు. వారినెందుకు చంపుతున్నారు? చంపాలనుకుంటే రాష్ట్రాన్ని లూటీ చేసిన రాజకీయ నేతలు, అధికారులను చంపండి’ అని ఆయన అనడం అక్కడి వారిని ఎంతో ఆకట్టుకుంది. అయితే, రాజకీయ నాయకులు, అధికారులను చట్ట పరంగా శిక్షించకుండా చంపమని ఉగ్రవాదులకు పిలుపును ఇవ్వడం, అది కూడా ఒక గవర్నర్ అనడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.