ఒక్క తప్పు... ఏపీ సర్కారు పరువు గోవిందా!

April 06, 2020

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని...పలువురు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనుకుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో క్రీడా ర్యాలీ చేపట్టారు. అయితే నేపథ్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్ వల్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

క్రీడా ర్యాలీ సందర్భంగా బీచ్ రోడ్డులో పలువురు క్రీడా కారుల బ్యానర్లని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ అన్నీ బ్యానర్లు బాగున్నా ఒకటి మాత్రం ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా కనిపించింది. ఓ ఫ్లెక్సీలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బొమ్మను ముద్రించి.. కింద పేరు మాత్రం పీటి ఉష అని రాశారు. అంతేకాదు, 'క్రీడా పోటసహకాలు' అంటూ ఇంగ్లీషులో తప్పుగా ముద్రించారు. పైగా పీటీ ఉష అంటూ రాసిన పేరు కింద పద్మ భూషణ్, పద్మశ్రీ, అర్జున అవార్డు అంటూ ముద్రించారు.

ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుతంపై ట్రోలింగ్ జరిగేలా చేసింది. ప్రభుత్వ అధికారులకు ఈమాత్రం క్రీడా పరిజ్ఞానం లేదా..? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడేస్తున్నారు. మొత్తం మీద క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించాలన్న ప్రభుత్వం మంచి ఉద్దేశం పక్కకుపోయి..ఈ పోస్టర్‌ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది.