కేసీఆర్ తాతా.. సాయం చేయవా? 

June 04, 2020

కరోనా వేళ.. ప్రజలకే కాదు.. ప్రభుత్వాలకు చిత్రవిచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో కొత్త కొత్త నిర్ణయాల దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి కలలో కూడా ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లు.. ఉద్యోగుల జీతాల్లో భారీ కోతలు.. కనుచూపు మేరలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నది ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి.
ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయంపై ఒక చిన్న పాప ప్రదర్శిస్తున్న పోస్టర్ పలువురిని కదిలించి వేస్తోంది. వరంగల్ జిల్లాలోని ఒక ప్రభుత్వ టీచర్ కుమార్తె సీఎం కేసీఆర్ ను ఉద్దేశించిన ఒక పోస్టర్ తో చేస్తున్న అభ్యర్థన ఇప్పుడు వైరల్ గా మారింది. కమలాపూర్ర బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు సత్యప్రకాష్ హన్మకొండలో పని చేస్తున్నారు.
ఇటీవల అతడి భార్య చనిపోయారు. ఈ బాధలో ఉన్న వేళలోనే జీతంలో కోతను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... ఆయన కుమార్తె ఒక పోస్టర్ ను పట్టుకొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నా.. నాన్న టీచర్లు. ఫిబ్రవరిలో ఇన్ కం ట్యాక్సు.. మార్చిలో 50 శాతం వేతనం కోత.. అమ్మ చనిపోయింది. ఒకేసారి అన్ని ఇబ్బందులు.. కేసీఆర్ తాతా కనికరించవా? అంటూ చిన్నారి లాస్య పట్టుకున్న పోస్టర్ ఇప్పుడు పలువురిని కదిలిస్తోంది. మరి.. తాత రియాక్ట్ అవుతారంటారా?