మరణ వేదన.. బద్నాం అని అవమానిస్తారా ఈటెల సార్?

August 13, 2020

మిగిలిన సందర్భాల్లో నిజాలు చెప్పకపోవచ్చు. కానీ.. చచ్చే ముందు ఎవరూ కూడా అబద్ధాలు.. అసత్యాలు చెప్పే అవకాశం లేదు. హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రిలో తనకు ఆక్సిజన్ తీసేశారని పేర్కొంటూ.. చచ్చిపోతున్నా డాడీ.. బై డాడీ అంటూ ఒక యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. ఆసుపత్రుల్లో చేసే చికిత్సా విధానంలో ఏమేం మార్పులు తీసుకురావాలన్న విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి. ఈ సెల్ఫీ వీడియో సంచలనంగా మారటమే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఛాతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన రవికుమార్ ఉదంతంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. హఠాత్తుగా గుండె ఆగిపోవటంతోనే చనిపోయారని చెప్పారు. ఒకరిద్దరు చనిపోతే మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్ని బద్నాం చేస్తారా? అని మండిపడుతున్నారు.

చనిపోయిన రవికుమార్ కు ఆక్సిజన్ అందలేదని చెప్పటం సరికాదన్నారు. రవికుమార్ అనేక ఆసుపత్రులు తిరిగి అర్థరాత్రి వేళ చెస్ట్ ఆసుపత్రికి వచ్చారని.. అయినా చేర్చుకొని చికిత్స అందించినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటానికి వీలుగా ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని.. ఇలా వీడియోలు తీసి పెట్టటానికి కాదన్నారు.

సోషల్ మీడియాలో బాధ్యత లేకుండా పెట్టిన వీడియోలను.. మీడియాలో ప్రసారం చేయటం మంచిది కాదన్న ఈటెల.. ఎవరో ఒకరిద్దరు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్ని బద్నాం చేయకూడదన్నారు. ఈటెల కోపాన్ని.. ఆగ్రహాన్ని.. ఆవేదనను చూసినప్పుడు చాలా విషయాలు కనిపిస్తాయి.

చాలా ఆసుపత్రుల్లో రవికుమార్ ను చేర్చుకోకున్నా.. ఛాతీ ఆసుపత్రిలో చేర్చుకున్న వైనాన్ని గొప్పగా చెప్పుకోవటం ఒక పట్టాన జీర్ణించుకోలేం. ఒక రోగికి వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత ఆసుపత్రులది. అలాంటి ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వహించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని వదిలేసి.. ఛాతీ ఆసుపత్రి ఆడ్మిట్ చేసుకోవటాన్ని గొప్పగా చెప్పుకోవటం షాకింగ్ అంశంగా చెప్పక తప్పదు.

అర్థరాత్రి వేళ.. ఆరోగ్య సమస్యతో వచ్చిన వారికి వైద్యం అందించేందుకు ప్రయత్నించిన ఛాతీ వైద్యుల్ని అభినందించాల్సిందే. అదే సమయంలో.. రవికుమార్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుల తీరును తప్పుపట్టాల్సిందే. తన మరణానికి కాస్త ముందుగా.. తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో వెల్లడించిన రవికుమార్.. ఎవరి మీదా నిందారోపణలు చేయలేదు. తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని చెప్పాడు.

ఇంకా చెప్పాలంటే.. తాను చనిపోతున్న వైనాన్ని గుర్తించి.. తన కుటుంబానికి రవికుమార్  బై చెప్పాడే తప్పించి ఎవరిని నిందించటం కూడా ఆ వీడియోలో కనిపించదు. ఈ ఉదంతంలో మంత్రి ఈటెలకు రవికుమార్ ఆవేదన కనిపించాలే కానీ.. ఇంటర్నెట్ ఇచ్చింది ఇంట్లో వారితో మాట్లాడుకోవటానికి.. ఇలా వీడియోలు తీయటానికి కాదంటూ ఆయన ప్రదర్శించిన ఆగ్రహం ఆశ్చర్యానికి గురి చేయక మానదు.

ఒకరి మరణ వేదనను.. ప్రభుత్వాన్ని.. ఒక రంగాన్ని బద్నాం చేసినట్లుగా చూసే కన్నా.. వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దేందుకు సాయం చేసేవిగా ఈటెల భావిస్తే బాగుండేది. ఎంత అధికారంలో ఉంటే మాత్రం.. మరణవేదన.. బద్నాం ఎందుకవుతుంది ఈటెల సాబ్?