కోర్టు - గవర్నమెంటు మధ్య వేడి చర్చ!

August 15, 2020

మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిల్‌పై నిన్న ఈరోజు విచారణ జరిగింది. ఇందులో కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి కేవలం ప్రజల ఆస్తులు రక్షించడానికి, పరిపాలన, అభివృద్ధి కోసం పనిచేయాలి గాని ప్రజలందరికీ సంబంధించిన ఆస్తులను  అమ్మడానికి కాదు అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. గవర్నమెంటు వద్ద ఉన్న ఆస్తులు అమ్మకుండా తాత్కాలికంగా విధించిన స్టేని మళ్లీ పొడిగించింది.

వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు డబ్బుల్లేక ప్రభుత్వం వద్ద కీలక ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అందులో గుంటూరు మిర్చియార్డు కూడా ఉంది.  దీనిపై కోర్టులో పిటిషను దాఖలు కావడంతో కోర్టు విచారణ చేపట్టింది. భూములు అమ్ముతూ పోతే ఎంతకాలం బండినడపగలరని ప్రశ్నించింది. ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా? అని అడిగింది. ఇపుడు విక్రయిస్తూ పోతే అవసరమైనపుడు కొనడానికి భూములు దొరుకుతాయా? అని ప్రశ్నించింది.

అంతేకాదు... ఒకవైపు ఇళ్ల స్థలాల కోసం భూములు కొంటూ మరోవైపు ప్రభుత్వం వద్ద ఉన్న భూములు అమ్మడంలో ఆంతర్యం ఏంటి? మీ దగ్గర ఉన్నవి అమ్మడం ఎందుకు? లేనివి కొనడం ఎందుకు? అని కోర్టు ప్రశ్నించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది ఆస్తుల వేలం ప్రభుత్వ విధాన నిర్ణయం అని, ఇటువంటి అంశాల్లో జోక్యం చేసుకునేటపుడు న్యాయపరమైన నియంత్రణలు పాటించాలని కోర్టుకు సూచించారు.

విచారణను ఏపీ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదని న్యాయమూర్తి గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. ఒకవేళ భూములు వేలం వేసినా హైకోర్టు తుది తీర్పు అమలు చేయాల్సి ఉంటుందని గతంలో మధ్యంతర ఉత్తర్వులను పొడించింది.