వేల కోట్లు వదిలేస్తారు.. ఈఎంఐల కోసం ముక్కుపిండి వసూలు చేస్తారే?

August 14, 2020

కేవలం యాభై మంది బడాబాబులు. దర్జాగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించే విషయంలో చేతులెత్తేసే ఇబ్బందులు ఎదురైతే.. సిం‘ఫుల్’గా రైటాప్ చేసేయటం కనిపిస్తుంది. తాజాగా దేశంలోని 50 మందికి చెందిన రూ.68,607 కోట్ల రుణ మొత్తాన్ని సాంకేతికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది ఆర్ బీఐ. అప్పుల్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రీతిలో నిర్ణయం తీసుకున్న వారి పేర్లు చూస్తే మతిపోవాల్సిందే. సమాజంలో వీవీఐ ట్రీట్ మెంట్ పొందే వారంతా వేలాది కోట్లు చెల్లించకుండా వదిలేసినా.. చర్యలు ఎందుకు తీసుకోరు అన్నది ప్రశ్న.
కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మూడు నెలల పాటు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ ఈఎంఐలను మారిటోరియం చేసినట్లుగా కేంద్రం చెప్పినా.. వాస్తవంలో మాత్రం సీన్ మరోలా ఉంది. మూడు నెలల మారిటోరియంలో చాలామంది వద్ద నుంచి మార్చి నెలకు చెల్లించాల్సిన ఈఎంఐలను ముక్కుపిండి వసూలు చేశారు. ఒకవేళ ఈఎంఐలు తిరిగి చెల్లించలేని పక్షంలో.. వడ్డీతో పాటు.. అసలును చెల్లించక తప్పదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. మరికొన్ని బ్యాంకులు అయితే.. కరోనా వేళ.. రుణ వాయిదాల్ని చెల్లించని పక్షంలో పడే ఆర్థిక భారం ఎంతన్న విషయాన్ని గణాంకాల రూపంలో తయారు చేసి మరీ ఈ-మొయిల్స్ లో పంపుతున్నారు.
ఈ లెక్కను చూసినోళ్లు ఉలిక్కిపడి.. కష్టమైనా.. నష్టమైనా.. జీతం వచ్చినా రాకున్నా.. అప్పు చేసైనా.. చెల్లించాల్సిన ఈఎంఐల్ని చెల్లించేలా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా చూసినప్పుడు.. మారిటోరియంలోకి వెళ్లి.. ఆర్థికంగా భారీగా నష్టపోయే కన్నా.. ఎవరో ఒకరి దగ్గర రుణాన్ని తీసుకొని చెల్లిస్తున్న వారు ఎందరో. ఇలాంటి పరిస్థితుల్లో బడాబాబులు చెల్లించాల్సిన భారీ మొత్తాల్ని రైట్ ఆఫ్ చేసిన వైనం సగటుజీవుల గుండెల్లో భగ్గుమంటున్నాయి. తాము చెల్లించాల్సిన ఈఎంఐలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న బ్యాంకులు.. పెద్దోళ్ల వేలాది కోట్ల మొత్తాన్ని వదిలేయటం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గీతాంజలి జెమ్స్ రూ.5492 కోట్ల అప్పును రద్దు చేసేస్తే.. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.1943.. నక్ష్తత్ర బ్రాండ్స్ రూ.1109కోట్లు.. విన్సమ్ డైమండ్స్ రూ.4076 కోట్లు.. కుడోస్ కెమి రూ.2326 కోట్లు.. ఇలా చెప్పుకుంటూపోతే మరెందరి పేర్లనో బయటకు లాగాల్సి ఉంటుంది. వాస్తవానికి సాధారణ ప్రజల సంపాదన తక్కువే అయినప్పటికీ.. వారికి వచ్చిన మొత్తంలో ఆదాయపన్ను కట్టటంతో పాటు.. వివిధ సేవల మీద పన్నులు చెల్లిస్తూనే.. తాము తీసుకున్న రుణాలకు సంబంధించిన ఈఎంఐల్ని క్రమ తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.
తాజాగా విడుదల చేసిన జాబితాలో సురానా కార్పొరేషన్ లిమిటెడ్ రూ.850 కోట్లు కాగా.. ఇందూ ప్రాజెక్టు లిమిటెడ్ రూ.855 కోట్లు.. ఆర్స్ ఇన్ ఫ్రాక్చర్ ప్రాజెక్ట్సు లిమిటెడ్ ప్రైవేటు లిమిటెడ్ రూ.794 కోట్లు ఇలా పలు నిర్మాణ సంస్థలు చెల్లించాల్సిన రుణాల్ని భారీగానే ఉన్నాయి. బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న ఈ సంస్థలు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవటంతో వారి రుణాల్ని రద్దు చేశారు. అలాంటప్పుడు.. ఈ సంస్థల నుంచి భవనాలు కొనుగోలు చేసిన సామాన్యులకు మేలు కలిగేలా ప్రభుత్వానికి లోటు తగ్గేలా చర్యలు తీసుకోవటం బాగుంటుంది కదా? ఆ దిశగా పాలకులు ఎందుకు ఫోకస్ పెట్టనట్లు?