దేశంలో హాట్ స్పాట్ జిల్లాలు 170... అందులో మనవే 19

August 08, 2020
CTYPE html>
కరోనా మహమ్మారి దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కట్టడి కోసం ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేసినా... వైరస్ విస్తృతి ఏమాత్రం తగ్గిన దాఖలా కనిపించడం లేదు. దీంతో లాక్ డౌన్ ను మరో 19 రోజులకు పొడిగిస్తూ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో నెలల తరబడి లాక్ డౌన్ ప్రకటిస్తూ పోతే... దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందన్న భయాందోళనలూ నెలకొన్నాయి. అయితే ఈ నెల 20 తర్వాత లాక్ డౌన్ ను కొంతమేర సడలించనున్నట్లుగా ప్రధాని ప్రకటించారు. ఆ సడలింపు కరోనా విస్తృతి లేని జిల్లాలకే పరిమితమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా ప్రభావిత జిల్లాలు ఎన్ని ఉన్నాయి? అవేవి? అన్న వివరాలను వెల్లడించింది. ఈ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం దేశంలోని హాట్ స్పాట్ జిల్లాలను ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదైన జిల్లాల సంఖ్యను 170గా ప్రకటించిన అగర్వాల్... ఆ జిల్లాలన్నింటినీ హాట్ స్పాట్ జిల్లాలుగా పరిగణిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో లాక్ డౌన్ సడలింపు ప్రశ్నే ఉండదన్నట్లుగా అగర్వాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా విస్తృతి అంతగా లేని జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించి.. .వాటిలోనే లాక్ డౌన్ సడలింపును అమలు చేయనున్నట్లుగా చెప్పారు. ఇలా కేంద్రం ప్రకటించిన హాట్ స్పాట్ జిల్లాలు 170 కాగా.. వాటిలో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు చెందిన జిల్లాలు 19 ఉన్నాయి. వాటిలో ఏపీకి చెందిన 11 జిల్లాలు ఉండగా.. తెలంగాణ జిల్లాలు 8 ఉన్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా... హాట్ స్పాట్ జిల్లాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణతో పోలిస్తే... ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా... హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య మాత్రం తెలంగాణ కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఏపీ, తెలంగాణల్లో హాట్ స్పాట్ జిల్లాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలు: గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం. అంటే ఏపీలో ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను హాట్ స్పాట్ జిల్లాలుగా కేంద్రం ప్రకటించింది.తెలంగాణలో హాట్ స్పాట్ జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్.