ప్రభుత్వ ఉగ్రవాదం..!

August 05, 2020

వైసీపీలో చేరకుంటే దాడులే
విపక్ష నేతల అణచివేత
దారికి రాకుంటే జైలుకే
అచ్చెన్న, జేసీ ప్రభాకర్‌రెడ్డి,
అస్మిత అరెస్టులు ఆ కోవలోవే
ఈఎస్‌ఐ మందుల స్కాంలో
అచ్చెన్నాయుడికి సంబంధమే లేదు
విజిలెన్స్‌ నివేదికలో ఆయన పేరేలేదు
అయినా 300 మంది పోలీసులతో ఇల్లు ముట్టడి
ఆపరేషన్‌ చేయించుకున్నారన్న కనికరమైనా లేదు
కనీసం మందులైనా తీసుకోనివ్వలేదు
బ్లీడింగ్‌ అవుతుందని చెప్పినా వినలేదు
కారులో వందల కిలోమీటర్ల ప్రయాణం
దీంతో మాజీ మంత్రికి బ్లీడింగ్‌
అయినా రిమాండ్‌కు తరలింపు
నకిలీ ఎన్‌వోసీలు సృష్టించారని
ప్రభాకర్‌రెడ్డి, అస్మితరెడ్డిపై ఆరోపణ


జగన్‌ ప్రభుత్వ ఉగ్రవాదం రానురాను పేట్రేగిపోతోంది. తన దారికి రాని విపక్ష నేతల అణచివేతే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తాను 16 నెలలు జైలులో ఉండడానికి ప్రధాన కారణం..

తనపై దివంగత టీడీపీ సీనియర్‌ నేత  కె.ఎర్రన్నాయుడు తనపై ఉమ్మడి హైకోర్టులో వేసిన పిటిషనే కారణమని వైఎస్‌ జగన్‌ ఆయన కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. చనిపోయిన ఎర్రన్నాయుడిని ఏమీ చేయలేరు. అందుకే తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న కె.అచ్చెన్నాయుడిపై కత్తిగట్టారు.

వైసీపీలో చేరాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అన్నారు. పైగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తుండడంతో ఈఎస్‌ఐ మందుల కొనుగోలు స్కాంలో ఆయన్ను ఇరికించారు.

అలాగే 2014లో వైసీపీలో చేరకుండా టీడీపీలో చేరి తనను అవమానించిన జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాన్ని ఏడాదిగా వేధించుకు తింటున్నారు. ఆయన ట్రావెల్స్‌ బస్సులను, ట్రాలీలను స్వాధీనం చేసుకుని ఆర్థిక మూలాలను దెబ్బతీశారు.

ఇప్పుడు ఏకంగా ఆయన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అస్మితరెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేయించారు. అచ్చెన్న అరెస్టుకు నిరసన వ్యక్తంచేసిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేశారు.

ఈ అక్రమ అరెస్టులపై టీడీపీ నేతలెవరూ ఉద్యమించకుండా గృహనిర్బంధంలో ఉంచారు. ఇలాంటి దమనకాండ పశ్చిమ బెంగాల్లో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు. అక్కడ వివిధ పార్టీల కార్యకర్తలను మాత్రమే టార్గెట్‌ చేస్తుంటారు. ఇక్కడ మాత్రం ఏకంగా నేతలనే జైళ్లలో పెడుతున్నారు.


విజిలెన్స్‌ నివేదికలో పేరేదీ?


టీడీపీ హయాంలో 2014 నుంచి 2016 వరకు అచ్చెన్న కార్మిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఈఎ్‌సఐ నిధులతో మందులు, వైద్య, ల్యాబ్‌ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. ఆయనకు కూడా పాత్ర ఉందని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది.

దీనిపై విజిలెన్స-ఎనఫోర్స్‌మెంట్‌ దర్యాప్తునకు ఆదేశించింది. నకిలీ కొటేషన్లతో అసలు ధరల కంటే, 136 శాతం అదనంగా ధరలు కోట్‌చేసి నిధులు పక్కదారి పట్టించారని విజిలెన్స్‌ తన నివేదికలో పేర్కొంది. ఇందులో అచ్చెన్న పేరునే ప్రస్తావించలేదు.

అయినా అధికారులతో పాటు ఆయన్ను కూడా ఏసీబీ బాధ్యుడిగా పేర్కొంది. ఆయన్ను ప్రశ్నించడానికి నోటీసులు కూడా ఇవ్వలేదు. 12వ తేదీ తెల్లవారుజామున 5.30కి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని స్వగృహంలో ఉన్న అచ్చెన్న ఇంటిని 300 మంది పోలీసులతో ముట్టడించారు. తలుపులైనా తట్టలేదు.

50 మంది పోలీసులు గోడదూకి ఇంట్లోకి దూసుకెళ్లారు. అరెస్టు వారంటు కూడా చూపలేదు తెల్ల కాగితంపై చేతిరాతతో అరెస్టు సమాచారమిచ్చారు. ఉన్నపళంగా విజయవాడ బయల్దేరాలన్నారు.

ఆయన అప్పటికి రెండ్రోజుల క్రితమే పైల్స్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారు. వందల కిలోమీటర్ల దూరం కారులో వెళ్తే ప్రమాదమని కుటుంబ సభ్యులు వేడుకున్నా అధికారులు వినలేదు.

కనీసం మానవత్వం చూపించలేదు. అదీగాక అంత మంది గుంపుగా వచ్చినా ఒక్కరు మాస్కు వేసుకోలేదు. కరోనా నియంత్రణ జాగ్రత్తలే తీసుకోలేదు. అడ్డగోలుగా వ్యవహరించారు.

విజయవాడ  ఏసీబీ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఈఎస్‌ఐ వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆపరేషన్‌ చేసిన చోట బ్లీడింగ్‌ అవుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే ఆస్పత్రికి పంపించాలని సూచించారు.

కానీ ఏసీబీ అధికారులు ఆయన్ను మంగళగిరిలోని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు.

సబ్‌జైలు నుంచి ఆయన్ను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బ్లీడింగ్‌ను గుర్తించిన వైద్యులు మళ్లీ ఆపరేషన్‌ చేయాలంటున్నారు.

బీసీ వర్గాల నాయకుడు, అసెంబ్లీలో ఓ సీనియర్‌ నేత పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ఇంత ఉన్మాదమా? ఆపరేషన్‌ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటుంటే ఇలాగేనా వ్యవహరించేది?

ఆయనేమైనా పారిపోతారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకూడదని సీఎం నిర్ణయించుకున్నారు.

ఇలా మాట నిలబెట్టుకున్నారన్న మాట! శుక్రవారం రాత్రి వరకు ఈ వ్యవహారాన్ని సాగదీస్తే ఆయన బెయిల్‌ తీసుకోవడానికి అవకాశం ఉండదు.

రెండో శనివారం, ఆదివారం సెలవులు. దీంతో రెండ్రోజులు జైల్లోనే గడపక తప్పదు. ఇలా కసి తీర్చుకున్నారు.

బీఎస్‌ఈ-3 నుంచి వాహనాలను బీఎస్‌ఈ-4గా మార్చడం, నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి వాటిని ఆంధ్రకు తరలించడం వంటి అభియోగాలతో ప్రభాకర్‌రెడ్డిని, నకిలీ ఇన్సూరెన్సుల వ్యవహారంలో ఆయన కుమారుడిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.