బడ్జెట్‌ ఘనం.. ఖర్చు స్వల్పం

July 04, 2020

కేటాయింపుల్లో 33 శాతమే ఖర్చు
చంద్రబాబు ప్రభుత్వాన్ని మించి భారీ స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొన్న జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు అన్ని శాఖల కేటాయింపుల్లోనూ కోతపెడుతోంది. ఎక్కడికక్కడ ఖర్చులపై ఆంక్షలు పెడుతోంది. ఆయా శాఖల వద్ద నిధులు మిగిలిపోయాయంటూ వాటన్నిటినీ తనకు మళ్లించుకుని.. వాటిని సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతోంది. రూ.2.27 లక్షల కోట్లతో ఘనంగా పెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం మొదటి 6 నెలల్లో ఖర్చు చేసిన రెవెన్యూ వ్యయం కేవలం 33 శాతమే. ఇంత భారీ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయానికి రూ.1.80 లక్షల కోట్లు కేటాయించగా మొదటి ఆరు నెలల్లో అందులో మూడో వంతు (రూ.60,201.34 కోట్లు) మాత్రమే వ్యయం చేసింది. మూలధనం వ్యయం కోసం రూ.32,293 కోట్లు కేటాయించగా ఖర్చు పెట్టింది కేవలం రూ.3441 కోట్లు (అంటే పది శాతమే). రెవెన్యూ వ్యయం కింద చాలా శాఖల్లో కనీసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తుంగభద్ర బోర్డు, కడప, అనంతపురం సాగునీటి ప్రాజెక్టులు, ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ, నేషనల్‌ హైవేస్‌, సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ శాఖల్లో ఖర్చును జీరోగా చూపించారు.

మైనారిటీస్‌ కమిషన ఖర్చు మైనస్‌ 11 శాతం ఉండడం విచిత్రం. అతి కీలకమైన గ్రామీణ నీటి సరఫరా శాఖకు ఈ ఆరు నెలల్లో 9 శాతమే ఖర్చు పెట్టారు. పంచాయతీరాజ్‌ శాఖలో కేవలం 11 శాతం, పట్టణాభివృద్ధి శాఖలో 21 శాతం, దేవదాయ శాఖలో 21 శాతం, గిరిజన సంక్షేమ శాఖలో 39 శాతం, న్యాయ శాఖలో 2 శాతం, ఐటీ శాఖలో 11 శాతం, చేనేత శాఖలో 6 శాతం, పోలవరం ప్రాజెక్టుకు 1 శాతం, కార్మిక శాఖలో 5 శాతం, ఆర్‌ అండ్‌ ఆర్‌కి 30 శాతం, పరిశ్రమల శాఖలో 25 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. అగ్రి మార్కెటింగ్‌, వ్యవసాయం, మార్కెటింగ్‌ , రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌, లీగల్‌ మెట్రాలజీ, సమాచార, పౌరసంబంధాలు, హెచఆర్‌డీ, కుటుంబసంక్షేమం, డ్రగ్స్‌ కంట్రోల్‌, సైనిక సంక్షేమం, ఆక్టోపస్‌, చేనేత, జౌళి, రవాణా, రోడ్లు, భవనాల శాఖలకుమూలధన వ్యయం జీరో.
6 నెలల రాబడి రూ.52,551 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లో రూ.77,349 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.24,798 కోట్లు అప్పులే. అప్పులు పోను 6 నెలల్లో వచ్చిన రాబడి రూ.52,551 కోట్లుగా ఉంది. ఈ 6 నెలల్లో కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.13,397 కోట్లు, సొంత పన్ను ఆదాయం రూ.28474 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.1352 కోట్లు, గ్రాంట్లు రూ.9326 కోట్లు మాత్రమే వచ్చాయి. ఓపెన మార్కెట్‌ రుణాల ద్వారా రూ.20,100 కోట్లు, కేంద్రం నుంచి రూ.924 కోట్ల లోన్లు, నాబార్డు, ఎనసీడీసీ నుంచి రూ.143 కోట్లు, డిపాజిట్లు, లావాదేవీల ద్వారా రూ.3,964 కోట్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రజాఖాతాల నుంచి నిధుల బదిలీ ద్వారా అప్పులు పెరుగుతుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.15,000 కోట్ల ప్రజారుణం సేకరించేందుకు అనుమతి కావాలని ఆర్థిక శాఖ డిసెంబరు మొదటి వారంలో కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. ప్రజాఖాతాల నుంచి నిధుల బదిలీ ద్వారా పెరుగుతున్న అప్పు గురించి వివరాలు ఇవ్వాలని.. అప్పుడు రుణానికి అనుమతిపై స్పందిస్తామని స్పష్టం చేసింది.

Read Also

బీజేపీ లో ''జే'' టీం
Millennium Towers Companies Recieved Notices
Exclusive: Kia in talks over moving $1.1 billion India plant out of Andhra Pradesh?