250 కిలోల యాపిల్ పండ్ల దండ‌తో...బెయిల్ పొందిన నేత‌కు స్వాగ‌తం

May 30, 2020

కాంగ్రెస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ అనే పేరు పొందిన క‌ర్ణాట‌క నేత డీకే శివ‌కుమార్‌కు జైలు నుంచి తిరిగి వ‌చ్చిన స‌మ‌యంలో ఊహించ‌ని స్వాగ‌తం ద‌క్కింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయ్యి బెయిల్‌పై తిరిగివచ్చిన ఆయ‌న కోసం వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు బెంగ‌ళూరు విమానాశ్రయానికి తరలివచ్చారు. శివకుమార్‌ బయటికి రాగానే పూలు చల్లుతూ, పటాకులు కాల్చుతూ సంబురాలు చేశారు. శివకుమార్‌కోసం ప్రత్యేకంగా దాదాపు 250 కిలోల ఆపిల్‌ పండ్లతో భారీ దండను రూపొందించి క్రేన్‌ సాయంతో తీసుకొచ్చి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి కర్ణాటక పీసీసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను సెప్టెంబర్‌ 3న అరెస్ట్‌ చేసింది. ఆయన శుక్రవారం బెయిల్‌పై తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మనీలాండరింగ్‌ కేసులో సుమారు 50రోజుల పాటు తీహార్‌ జైల్లో ఉండి విడుద‌లైన నాటి నుంచీ సోనియాగాంధీ, పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఢిల్లీలో భేటీ అవుతూ వచ్చిన శివకుమార్‌..శనివారం బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శివకుమార్‌ విడుదలపై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ కె.సి వేణుగోపాల్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'శివకుమార్‌ మమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే మా పోరాటాన్ని బీజేపీ కుటిల రాజకీయాలు ఎప్పటికీ ఓడించలేవు' అని పేర్కొన్నారు.  మ‌రోవైపు కర్ణాటక బీజేపీ స్పందిస్తూ...అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఘన స్వాగతం పలుకడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన బుద్ధిని చాటుకుంది`అని ట్వీట్‌ చేసింది.
మ‌రోవైపు, శివ‌కుమార్‌కు స్వాగ‌తం ప‌లికిన తీరుపై కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. డీకే శివకుమార్‌కు బెంగళూరులో ఘనస్వాగతం లభించిన కొన్ని గంటల్లోనే జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే స్పందించారు. నేరస్థులను సమాజం నుంచి బహిష్కరించాల్సిందిపోయి స్వాగత సత్కారాలు నిర్వహిస్తున్నారంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. నిజాయితీపరులను ఆరాధించడంలో అభ్యంతరం లేదని, అవినీతిపరులను ప్రోత్సహించడం తప్పు అని చెప్పారు. సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పుడే ప్రజలు మార్పు కోసం కృషి చేస్తారన్నారు.