మీడియా చేతిలో బుక్కైపోయిన మోడీ

August 07, 2020

ఆ మధ్య హైదరాబాద్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తే.. ముందు అనుకున్న టూర్ మ్యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం మార్చిందని.. మురికివాడలు, అపరిశుభ్రత ఉన్న మార్గాల్లో ఆమె ప్రయాణం సాగకుండా చూశారని.. హైదరాబాద్ మురికివాడల్ని మరుగుపరిచే ప్రయత్నం చేశారని వార్తలొచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు.. డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఇదే మోడల్‌ను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ, గుజరాత్‌ల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో ట్రంప్ ప్రయాణించే మార్గంలో అక్కడక్కడా మురికివాడలు ఉండటంతో అవి ట్రంప్‌కు కనిపించకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసింది గుజరాత్ ప్రభుత్వం

మురికివాడలున్న చోట.. రోడ్డు పక్కన వాటిని కనిపించకుండా చేసేలా గోడ నిర్మిస్తుండటం స్థానికుల్ని విస్మయ పరుస్తోంది. ముందు ఈ గోడ ఎందుకు కట్టారన్నది జనాలకు అర్థం కాలేదు. తర్వాత అసలు విషయం అర్థమైంది. ట్రంప్ పర్యటన నేపథ్యంలోనే మురికివాడ పక్కన గోడను నిర్మిస్తున్నారని వెల్లడైంది. ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో వరుసబెట్టి టీవీ ఛానెళ్ల ప్రతినిధులు కెమెరాలు, మైకులు పట్టుకుని దిగిపోయారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి చైనా వాళ్లు ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను నిర్మిస్తే.. తన దేశంలో పేదరికాన్ని కప్పి పుచ్చేందుకు మోడీ సర్కారు ‘గ్రేట్ వాల్ ఆఫ్ మోడీ’ని నిర్మించిందని.. 12 ఏళ్లు గుజరాత్‌ను పాలించి, ఆరేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ.. తన సొంతగడ్డపై పేదరికాన్ని నిర్మూలించలేక ఇలా చేయడం సిగ్గు చేటని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ట్విట్టర్లో దీని మీద పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై మోడీ సర్కారు మౌనం వహిస్తుండటంతో గోడ గురించి జరుగుతున్న ప్రచారం నిజమే అని స్పష్టమవుతోంది.