గ్రీన్ కార్డ్ గొడవ... కొత్త పరిష్కారం దొరుకుతుందా?

August 12, 2020

కరోనా మహమ్మారి ఎన్నో కలలను చిద్రం చేసింది. మరెన్నో అవకాశాలను నాశనం చేసింది. ఆశలు అడియాశలవుతున్నాయి, ఓడలు బండ్లవుతున్నాయి. ఇప్పటికే కరోనాతో విలవిల్లాడుతూ కరోనాలో అగ్రస్థానంలో నిలబడిన అమెరికా ఇప్పటికే అనేక చేదువార్తలు చెప్పింది. తాజాగా ఎంతో కాలం అక్కడ ఉంటూ శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకోవాలనుకుంటున్న వారి కలలను చిద్రం చేసింది.

అసలే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక... వలసలపై అనేక ఆంక్షలు విధించిన ట్రంప్... తదనంతరకాలంలో అనేక ఇబ్బందులు పెట్టారు. భారత్ సహా అనేక దేశాల నుంచి ఉపాధి కోసం వెళ్లిన ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ప్రతి అవకాశాన్ని వాడుకుని అన్ని వీసాల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా గ్రీన్ కార్డుపై ట్రంప్ కన్ను పడింది. తన తాత్కాలిక స్వలాభం కోసం జాతి వైరాన్ని రగల్చే పనిలో పడ్డారు ట్రంప్. అందులో భాగంగా నిబంధనలు కఠినతరం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ సర్కార్ ఆలోచనలు సెనేటర్ మైక్ లీ నోటిలో వెల్లడయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లు పడుతుందేమో అంటూ అతను చేసిన కామెంట్లు ఎంతో మందిని గాయపరిచాయి.

అమెరికాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో... ఇప్పటికే దరఖాస్తు చేసి అప్రూవల్ కోసం వేచిచూస్తున్న వారు కూడా ఈ వ్యాఖ్యలు విని షాక్ తిన్నారు. స్థానికుల్లో వలసలపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి ట్రంప్ వేసే ట్రిక్స్ ఇవన్నీ. సమర్థత పరంగా జో బైడెన్ తో పోలిస్తే ట్రంప్ వెనుకపడి ఉన్నా... ప్రాంతీయ వాదంతో పై చేయి సాధించాలన్న ఆలోచనలతో ట్రంప్ ముందుకు వెళ్తున్నాడు.

లీ మాటలకు అర్థం ఏంటంటే... నిబంధనలు కఠిన మైతే ఎపుడు గ్రీన్ కార్డ్ వస్తుందో, అసలు వస్తుందో రాదో అన్న భావన. ఇప్పటికే గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చాలా సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారు. ఈ వేచిచూసే క్రమంలో అసలు తాత్కాలిక నివాస హక్కును కూడా వారు కోల్పోతున్నారని సెనేటర్ డిక్ డర్బిన్ చెప్పారు.  ఈ గ్రీన్ కార్డు సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం కనుగొనేందుకు  సెనేటర్లు కలిసి రావాలని లీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానంలో ఉన్న లోపాల వల్ల  గ్రీన్ కార్డు దరఖాస్తుదారుడు మరణిస్తే వారి సంతానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే దీనిపై ఆలోచించాలని పిలుపునిచ్చారు.