కరోనా కట్టడి మద్యంపాలు

August 10, 2020

రాష్ట్రంలో లిక్కర్‌ షాపులకు గ్రీన్‌సిగ్నల్‌
అత్యవసరమైన వాటికే కేంద్రం అనుమతి
మన ప్రభుత్వానికి మద్యమే ప్రధానం
రాష్ట్రవ్యాప్తంగా 2,100 దుకాణాలు ఓపెన్‌
ఒకేసారి 75ు ధర పెంపు
నాసిరకం బ్రాండ్లకూ అధిక రేటు
కమీషన్లు ఇవ్వలేదని
ప్రీమియం బ్రాండ్లకు నో చాన్సు
అయినా విరగబడుతున్న జనం
కిక్కు కోసం కిక్కిరిసిన క్యూలు
భౌతికదూరం చెరిపి తోపులాటలు

ప్రపంచం మొత్తాన్నీ కరోనా గడగడలాడిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడిని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ప్రభుత్వాలన్నీ ఆ దిశగా చర్యలు చేపట్టాయి. ఆరోగ్య రంగాన్ని ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన దేశాలు, రాష్ట్రాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఇప్పుడు పోటీపడుతున్నాయి. నవ్యాంఽధ్ర ప్రజలకు ఆ స్పృహ ఉన్నా.. రాష్ట్రప్రభుత్వానికి మాత్రం అది లోపించినట్లు కనిపిస్తోంది. ఒక రోజు కాదు. రెండ్రోజులు కాదు.. ఏకంగా 43 రోజులు. మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలు స్వీయ గృహ నిర్బంధం పాటించారు. లాక్‌డౌన్‌ను దీక్షలా చేపట్టారు. కానీ ఈ పట్టుదలంతా ప్రభుత్వ దుర్నీతి ముందు తేలిపోయింది. 43 రోజులుగా మందు తాగకుండా దాదాపు మానివేసే బాటలో ఉన్న మందుబాబులందరినీ మళ్లీ తాగుబోతులను చేయాలన్న దాని నిర్ణయం ప్రజలకు ఏవగింపు కలిగిస్తోంది.

ఇన్నిరోజులుగా ఇంట్లోనే ఉన్నా గొడవల్లేకుండా గడిపిన కుటుంబాల మధ్య ఏకంగా కలతలే రేగుతున్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను తొలగించి అత్యవసరమైన వాటిని పునఃప్రారంభించవచ్చని కల్పించిన వెసులుబాటు.. ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా కనిపించింది. మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించింది. ఫలితంగా భౌతిక దూరం గాలిలో కలిసిపోయింది. మాస్కులు ధరించాలన్న బుద్ధి మందగించింది. మందుప్రియులంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. కరువు ప్రాంత జనాలు నీటిబొట్టు కోసం కొట్టుకున్నట్లు.. దుకాణాలపై ఎగబడ్డారు. తొలిరోజు (4వ తేదీన) మద్యం షాపుల ఎదుట  దృశ్యాలు చూస్తే అసలు మనం లాక్‌డౌన్‌లోనే ఉన్నామా అన్న సందేహం రాకమానదు.

25 శాతం పెంచి అమ్మినా.. కొనేందుకు బారులు తీరారు. ఒక్కరోజే  12,52,980 లిక్కర్‌ కేసులు, బీరు 75,775 కేసులు అమ్ముడయ్యాయి. సాయంత్రం ఆరు గంటల వరకు రూ.36 కోట్ల అమ్మకాలు జరిగాయి.  ఆ తర్వాత గంట అమ్మకాలతో కలిపితే మొత్తం రూ.40 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రంలో సాధారణ సమయాల్లో మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాత్రి 7 తర్వాత మొత్తం మూసేయాలని ఆదేశించడంతో రాత్రి ఒక్క గంట మాత్రమే అమ్మకాల సమయం కుదించారు. దీంతో సాధారణంగా జరిగే అమ్మకాలకు, ప్రస్తుత పరిస్థితికి పెద్దగా తేడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం 11 గంటలకు షాపులు తెరిస్తే రెండు గంటల ముందు నుంచే షాపుల వద్ద గుమికూడారు.

పలు చోట్ల రద్దీని నియంత్రించడం పోలీసులకు అలవికాని పనిగా మారింది. దీంతో కొన్నిచోట్ల పోలీసులు కూడా చేతులెత్తేశారు. జనం భౌతిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ గంటల తరబడి నిలబడ్డారు. తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి.

పైగా చాలా మంది మాస్కులు కూడా ధరించలేదు. దీంతో అందులో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా పెద్దసంఖ్యలో అది ప్రబలే ప్రమాదం ఉంది. దీనిపైనే ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు జోన్ల పేరుతో ప్రాంతాల వారీగా నిత్యావసరాలు, కూరగాయలకు ఉదయం నాలుగైదు గంటలు సమయం పెడితే, మద్యానికి మాత్రం ఏకంగా 8 గంటలు అవకాశం ఇచ్చారు. అది కూడా జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే రెడ్‌జోన్లలో ఉన్న ఐదు జిల్లాల్లో పూర్తిగా షాపులు మూసేయాల్సి వస్తుందని, దాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చి షాపులు తెరిచారు. తొలిరోజు మద్యం సంబంధిత సంఘటనల్లో ఆరుగురు చనిపోయారు.


రెడ్‌లో ఉన్నా.. వైన్‌ హడావుడి
కృష్ణాజిల్లా ముసునూరు మండలం గోపవరం ఆరెంజ్‌ జోన్‌లో, చెక్కపల్లి రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఈ జిల్లాలో ఆరెంజ్‌ జోన్లలోని ప్రాంతాల్లో మద్యం అనుమతించబోమని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రకటించినా.. దుకాణాలను తెరిచారు. విజయవాడ నగరం పూర్తిగా రెడ్‌జోన్‌లో ఉండడంతో మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. అయినా షాపులు తెరుస్తారన్న సమాచారంతో కొన్నిచోట్ల జనం బారులు తీరారు. చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

గుడివాడలో రద్దీ ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం మూడు గంటలకే మూసేశారు. మిగిలిన వారికి టోకెన్లు ఇచ్చి మర్నాడు రమ్మని పంపేశారు. ఇంకోవైపు ప్రభుత్వ తీరుపై మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. దీంతో మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికంటూ మరో 50 శాతం పెంచేశారు. అంటే వంద రూపాయల సీసా రూ.175 అయింది. అయినా జనం తగ్గలేదు.

దీనిపై సీఎం మాట్లాడుతూ ఢిల్లీలో 70 శాతం పెంచారని.. తాము మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి 75 శాతానికి పెంచామని సమర్థించుకున్నారు. మంత్రి పేర్ని నాని వితండ వాదన విస్తుగొల్పుతోంది. మద్యం షాపులపై జనం ఎగబడుతున్న విషయం ప్రస్తావిస్తే.. టీడీపీ నేతలే తమ కార్యకర్తలకు డబ్బులిచ్చి క్యూలలో నిలబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక దేవుడే ప్రజలకు రక్ష.


‘అమ్మ ఒడి’కి ఇచ్చి ‘నాన్న తడి’తో గిచ్చి..

ప్రభుత్వాలను ప్రధానంగా నడిపించేవి రెండే రెండు! ఒకటి... కార్లూ, బైకులు తాగే పెట్రోలు, డీజిలు! రెండు... మనుషులు తాగే బ్రాందీ, విస్కీ, బీరూ, రమ్ము వగైరా వగైరా అనే మద్యం! ఇంధనం అందరికీ అవసరమైతే, మద్యం కొందరి బలహీనత! ఈ బలహీనతను ప్రభుత్వాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. 43 రోజుల తర్వాత మద్యం షాపులు తెరిచి... ‘తాగేవారిని నిరుత్సాహపరచడం’ పేరిట రెండు రోజుల్లోనే రెండుసార్లు మద్యం ధర పెంచేశారు. ఎంతగా అంటే.... ‘అమ్మ ఒడి’ పథకం కింద ఇచ్చిన రూ.6,500 కోట్లను ఆరేడు నెలల్లోనే మందుకొట్టే ‘నాన్నల జేబు’ నుంచి లాక్కొనేంత! కరోనా సహాయం కింద ఇచ్చిన రూ.వెయ్యిని ‘ఐదు క్వార్టర్ల’తో సరిపెట్టేంత!

ఒకవైపు సంక్షేమ పథకం... మరోవైపు డబ్బులు వెనక్కి లాక్కొనే ‘పథకం’! ఆ మద్యం బ్రాండ్‌ విలువ 170 రూపాయలు. ఇందులో ప్రభుత్వానికి మిగిలేది 152 రూపాయలు. అంటే 18 రూపాయల మద్యాన్ని 170కి విక్రయిస్తున్నారన్న మాట! రకరకాల పన్నులతో మద్యం ధరకు బాగా ‘కిక్‌’ ఎక్కిస్తారు. ఇది చాలదని... కేవలం మద్యం ధరను రెండు రోజుల్లో దాదాపు 75 శాతం ఽపెంచేశారు. తాగేవాళ్లను నిరుత్సాహ పరిచేందుకు ఇలా చేశామనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ఎంతమాత్రం హేతుబద్ధత లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే... మద్యానికి అలవాటుపడ్డవారు ధరను లెక్కచేయరు. అంతకుముందు తమ సంపాదనలో మందు కోసం వంద రూపాయలు ఖర్చుపెట్టేవారు, ఇప్పుడు రూ.175 తగలేస్తారు.

ఇక... షాపుల సంఖ్య కుదించినా అంతే. మరో కిలోమీటరో, రెండు కిలోమీటర్లో దూరమైనా సరే, షాపును వెతుక్కుంటూ వెళ్లి మద్యం కొనుగోలు చేస్తారు. 4వ తేదీతో పోల్చితే 5న మద్యం షాపుల ముందు నిల్చున్న వారి సంఖ్య తక్కువే. దీనికి కారణం... ధరల పెంపు కాదు. చాలామంది మందుబాబులు 4నే ఎక్కువ సీసాలు కొనేశారు. పోనీ ఇవేమైనా ప్రీమియం బ్రాండ్లా అంటే అదీలేదు. ఊరుపేరూ లేని కంపెనీల మద్యం. పొరుగు రాష్ట్రాల నుంచి వైసీపీ నేతలు తరలించుకువచ్చినదే.

రకరకాల పేర్లు పెట్టి పనికిమాలిన మద్యం పోస్తున్నారన్న మాట. అదేమని అడిగితే.. ఉన్నది తాగాలని అంటున్నారు. ప్రీమియం బ్రాండ్ల కంపెనీలు కమీషన్లు చెల్లించకపోవడంతో ప్రభుత్ద పెద్దలు, అధికారులు పనికిమాలిన బ్రాండ్లను తెరపైకి తెచ్చి జేబులు నింపుకొంటున్నారు.


పది వంద ఎలా అవుతుందంటే...
మద్యానికి తొలుత ‘బేసిక్‌ ప్రైస్‌’ నిర్ణయిస్తారు. దానిపై పన్నుల మీద పన్నులు విధిస్తారు. ఎలాగంటే...
ఎక్సైజ్‌ డ్యూటీ: విలువ ఆధారంగా ఈ సుంకం మారుతుంది.
అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ: ఏ రకం మద్యమైనా 36 శాతం
వ్యాట్‌: ఇది బ్రాండ్‌నుబట్టి 70 నుంచి 190 శాతం వరకు విధించవచ్చు.
రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌: 10 శాతం
అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌: బాటిల్‌కు ఇంత చొప్పున రూపాయల్లో వసూలు చేస్తారు. (4, 5 తేదీల్లో పెంచింది ఈ పన్నే)


ఇవి కాకుండా... ప్రివిలేజ్‌ ఫీజు, సీఎంఆర్‌ఎఫ్‌ ఫీజుపేరిట స్వల్ప మొత్తంలో వసూలు చేస్తారు.
వెరసి... రూ.10 బేసిక్‌ ప్రైస్‌ ఉన్న మద్యం అన్ని రకాల పన్నులు కలిపాక వంద రూపాయలు అవుతుంది.